– మహిళా రైతులకు గ్లోబల్ మార్కెట్ అవకాశాల కల్పన
– మంత్రి సీతక్క ఆలోచనలు ఆచరణలో పెడుతున్న ‘సెర్ప్’
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : గ్రామీణ పేదరిక నిర్మూలనకు అసలైన అర్థం చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలోని ‘సెర్ప్’ విభాగం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళా రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో రైతులను నేరుగా మార్కెట్‌కు అనుసంధానం చేస్తూ దళారుల వ్యవస్థకు చెక్ పెడుతోంది. అంతేకాక ఆన్‌లైన్ మార్కెటింగ్, ఆధునిక రిటైల్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో రైతులను అనుసంధానం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తోంది. ‘సెర్ప్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భేనిశాన్’ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య (ఎఫ్‌పీసీ) రాష్ట్రంలోని మామిడి రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన రైతు బాలకృష్ణ దంపతులు ఈ సీజన్‌లో మల్లిక రకం మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం చిన్న రైతులకు కొత్త ఆశలు నింపింది. దీంతో ఇప్పటివరకు మామిడి రైతులకు రూ.151 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులకు అదనంగా 15 నుంచి 20 శాతం వరకు ఆదాయం లభిస్తోందన్నారు.
‘బేనిశాన్’తో ఎగుమతులు సాధ్యమయ్యాయి
గతంలో కొద్దిపాటి ఉత్పత్తి ఉన్న రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు అసాధ్యంగా భావించేవారు. కానీ ‘బేనిశాన్’ ద్వారా సమీకరణ, గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా, సప్లై చైన్ సదుపాయాలు కల్పించడం వల్ల చిన్న రైతులు కూడా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునే అవకాశం లభిస్తోంది. రిలయన్స్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, మోర్, స్టార్ బజార్, రత్నదీప్ వంటి ఆధునిక రిటైల్ సంస్థలతోపాటు పలు అగ్రో ప్రాసెసింగ్ కంపెనీలతో ‘భేనిశాన్’ ఒప్పందాలు కుదుర్చుకుంది. గతంలో చిన్న, సన్నకారు రైతులు తక్కువ పంట ఉత్పత్తి చేయడం వల్ల పెద్ద వ్యాపారులు వారిని పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. దీంతో దళారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్‌పీవో ద్వారా రైతుల ఉత్పత్తులను సమీకరించి పెద్ద మార్కెట్లకు విక్రయించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది.
భేవిశాన్ పరిధిలో 84 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు
ప్రస్తుతం భేనిశాన్ సమాఖ్య పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 84 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి 30 జిల్లాలు, 404 మండలాలు, 3072 గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 1.09 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఎక్కువమంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులే కావడం విశేషం.
ఎగుమతులకు వెళ్లే ప్రతి పండుకూ ప్రత్యేక ప్రాసెస్
=సెర్ప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రజిత నారెడ్ మాట్లాడుతూ ఎగుమతులకు వెళ్లే ప్రతి పండును నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎంపిక చేసి ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు. మామిడి పండ్ల నాణ్యత కాపాడేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో తెంపడం, గ్రేడింగ్ వంటి ప్రక్రియలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన అంటే పథకాల అమలు మాత్రమే కాదని, గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఆదాయం వచ్చే వ్యవస్థను నిర్మించడమే అసలు లక్ష్యమని మంత్రి సీతక్క ఆలోచనలకు అనుగుణంగా సెర్ప్ ద్వారా రైతులకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతు పండించిన పంటకు మార్కెట్ కల్పించడం, దళారుల ఆధిపత్యాన్ని తగ్గించడం, మహిళా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం దిశగా సెర్ప్ తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





