సంక్షేమం, మూసీ పున‌రుజ్జీవం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌లు

– 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
– తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతం
– పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు
– విద్యార్థుల రుణాలు భవిష్యత్తు పెట్టుబడులు
– వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
– బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతలను ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ 20147 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు చేరుకోవడం, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం 130.78 శాతం క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తితో ముందుకు సాగడం అద్వితీయ విషయని చెప్పారు. వ్యవసాయ రుణాల విషయంలో రూ.1,65,297 కోట్ల లక్ష్యానికి రూ.1,68,401 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం సాధించడం గర్వించదగ్గ విషయంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, అనుబంధ రంగాలకు కిసాన్ క్రెడిట్ కార్డు సహా వివిధ పథకాల ద్వారా బ్యాంకులు అందిస్తున్న మద్దతు అభినందనీయమని అన్నారు. రాష్ట్రం పారిశ్రామిక రంగంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళ, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చే రుణాల విషయంలో మరింత సానుకూల దృక్ఫథంతో ముందుకు రావాలన్నారు. విద్యార్థులకు ఇచ్చే రుణాలు యువతపై మనం పెట్టే భవిష్యత్ పెట్టుబడి అని చెప్పారు. సంక్షేమం-అభివృద్ధి రెండూ జోడెడ్లుగా పరుగులు తీయగలవని ప్రజాప్రభుత్వం చేతల్లో నిరూపించిందన్నారు. సమగ్రాభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, ఉపాధి సృష్టికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. నేడు ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధన రంగంపై దృష్టి సారిస్తోందని, అందులో భాగంగా ప్రజాప్రభుత్వం కూడా సౌరశక్తి విభాగంలో స్థిరమైన ప్రగతిని సాధిస్తోందని డిప్యూటీ సీఎం చెప్పారు. సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ఇతర పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలని కోరారు. సామాజిక భద్రత, బీమా పథకాల పరిధిలోకి రాష్ట్ర ప్రజలను తీసుకురావాలన్నారు. బ్యాంకులు కేవలం డబ్బు డిపాజిట్ చేసే, రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలుగానే కాక రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధిలో భాగస్వాములుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని, ప్రస్తుత వృద్ధి రేటు చూస్తుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమేనని భట్టి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ సగటు వృద్ధి రేటు 8.2%గా ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 10.7%తో దూసుకుపోతోందని చెప్పారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఉప ముఖ్యమంత్రి గర్వంగా ప్రకటించారు. రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందని, ఈ నేపథ్యంలో సేవల రంగానికి అధిక అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు.

వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

మహిళా ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో మహిళా సంఘాలకు రుణ పంపిణీపై యుద్ధప్రాతిపదికన దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యాపార, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాల్లో ఎదగడానికి మహిళలకు నగరం ఎన్నో అవకాశాలను ఇస్తోందని చెప్పారు. నగరంలోని మురికివాడల్లోని యువ మహిళా పారిశ్రామికవేత్తలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో త్వరలోనే అనేక ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను తీసుకు వస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్, లెదర్, టెక్స్‌టైల్ వంటి వివిధ రంగాలను డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్-ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ మోహన్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *