మాట ఓ గుబాళింపు…
మనసు తోటలో విరిసిన మల్లెపూల పరిమళం
గుచ్చే ముల్లుగా కాదు…
గుండెను గెలిచే గులాబీ రేకుగా ఉండాలి
కోపపు కత్తి కోయని చోట…
ప్రేమ పలుకు వంతెన కడుతుంది
మంచి మాట…
ఎండిన చెట్టుకు చిగురుల్ని అద్దె వసంతం
మాట లిపి
చిరునవ్వు కలిసిన సంభాషణ కావాలి
వెన్నెల తడిసిన నది అలల సంగీతం కావాలి
మనిషిని కొలిచేది రూపం కాదు
నోటి నుంచి జారిన ముత్యపు మాటలే
నిన్ను మనిషిలా నిలబెడతాయి
పరుష వాక్యం ఎప్పుడైనా
పగిలిన అద్దంలో
ప్రతిబింబంలా గాయపరుస్తుంది
మధుర పలుకుల ఊట
పసిబిడ్డ స్పర్శలా హృదయాన్ని హత్తుకుంటుంది
మాటకు మర్యాద జతైతేనే
మనసుల మధ్య మమత మొలుస్తాయి
వినయం తోడైతేనే
వ్యక్తిత్వ వికాసం రూపు దాల్చుతోంది
పలుకు వజ్రానికన్నా విలువైన సంపద
స్నేహం.. ప్రేమ కలిసిన మాట
ఎడారిలో జాలువారిన చల్లని జలధార
మనిషిని గెలవాలంటే వాదన కాదు
హృదయాలను తాకే మృదువైన భాష కావాలి
మాట ఓ గుబాళింపు
పరిమళం పంచే పుష్పంలా వికసిస్తేనే
మనిషి పేరు కాలానికీ సువాసనగా నిలిచిపోతుంది
డా. కటుకోఝ్వల రమేష్





