– అందుకే పంచాయతీరాజ్ చట్టం-2018కు సవరణ
– అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క
– ఏకగ్రీవంగా శాసన సభ ఆమోదం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : గ్రామ పంచాయతీకి వచ్చే డబ్బు గ్రామాభివృద్ధికే ఉపయోగపడాలి.. ఆదాయం గ్రామ అవసరాలకు అందుబాటులో ఉండాలి.. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి.. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి.. ఇదే ప్రజా ప్రభుత్వ విధానం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. దేశంలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే సంస్థలుగా కాక ప్రజలకు దగ్గరగా ఉండే స్వయం పాలనా సంస్థలుగా పనిచేయాలన్నదే దాని ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. అయితే స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలతోపాటు వాటికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా ఉండాలన్నారు. పంచాయతీలకు కొన్ని పన్నులు, సుంకాలు, ఫీజులు వసూలు చేసుకునే అధికారాలను కూడా కల్పించారని చెప్పారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, పారిశుధ్యం నిర్వహణ, వీధి దీపాలు ఏర్పాటు, తాగునీటి సరఫరా వంటి అనేక ప్రాథమిక పౌర సేవల బాధ్యతలు ఉన్నాయి. జీపీలకు ఆదాయం సమకూర్చుకునే అధికారం ఇచ్చి ఆ ఆదాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకునే స్వేచ్ఛ లేకపోతే స్థానిక స్వపరిపాలన ఎలా బలపడుతుంది అని మంత్రి ప్రశ్నించారు. ఇదే ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70లోని సబ్ సెక్షన్ 3కు సవరణ చేస్తూ బిల్లును ప్రవేశ పెడుతున్నామన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూర్చుకునే నిధులను ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత ఆ నిధులను వినియోగించుకోవాలంటే ట్రెజరీ ద్వారా డ్రా చేసుకోవాలి. దీనికి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. దీని వల్ల కొన్నిసార్లు నిధుల వినియోగంలో ఆలస్యం జరుగుతోంది. గ్రామంలో సమస్య వస్తుంది.. కానీ దాన్ని పరిష్కరించడానికి అవసరమైన డబ్బు అందుబాటులోకి రావడానికి ఎందుకు ఆలస్యం కావాలి.. ఆ డబ్బును వినియోగించుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ఫైనాన్సు కమిషన్ నిధులు బ్యాంకు ఖతాల్లో జమ అయినట్లుగానే జీపీ సొంత ఆదాయం కూడా బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చట్టాన్ని సవరిస్తున్నాం అని మంత్రి చెప్పారు.
గ్రామ సభ తీర్మానం మేరకు అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చు
మున్సిపాలిటీల్లో సొంత ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో వేసుకోవచ్చు.. కానీ పంచాయతీలకు ఆ వెసులుబాటు లేదు.. పంచాయతీల మీద గత ప్రభుత్వం వివక్ష చూపింది.. దాన్ని రూపుమాపడానికి చట్ట సవరణ చేస్తున్నాం.. గ్రామ సభ తీర్మానం మేరకు అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యాయి.. ఆ కాలానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు పూర్తి స్థాయిలో రాలేదు.. ప్రతి నెలా జీపీల కోసం రూ.50 కోట్లు వెచ్చిస్తున్నాం.. 2025-26 ఏడాదికి సంబధించి సెకండ్ ఇనస్టాల్మెంట్ రూ.619 కోట్లు రావాల్సి ఉంది.. మొదటి తేదీనే మల్టీ పర్పస్ వర్కర్లకు జీతాలు ఇస్తున్నాం.. కేంద్రం నూతన విధానాల కారణంగా గ్రామాల ఆభివృద్దిపై ప్రభావం చూపుతోంది.. వీజీజీ రాంతో రాష్ట్రాలపై రూ. 2 వేల కోట్ల అదనపు భారం పడుతుంది.. అయినా తాము పెద్ద ఎత్తున వీబీ జీ రాంజీ పనులు చేయిస్తున్నాం.. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంట కుంట, ఊరికి ఉట కుంటను నిర్మిస్తున్నాం.. ప్రతి గ్రామానికి పక్కా రహదారి ఉండాలని సీఎం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు ఇస్తున్నాం. హ్యమ్ విధానంలో వేల కీలోమీటర్లు నిర్మిస్తున్నాం.. ఫారెస్టు ప్రాంతాల్లో కేంద్ర అటవీ చట్టాలు రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు ఎదురవతున్నాయి.. దీంతో ప్రజల” ఇబ్బందులు పడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ ఇప్పించాలి అని అన్నారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బిల్లును అమోదించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేయగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనమండలిలోనూ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





