రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం

– ధాన్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం
– తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు దోపిడీ
– రైతు పక్షాన తెలంగాణ రక్షణ సేన పోరాటం
– నల్లగొండలో రైతు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కవిత

నల్గొండ, ప్రజాతంత్ర,జూన్‌11: ‌తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న సిగ్గు లేని ప్రభుత్వం ఇదంటూ రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నల్గొండలో రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌ ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయశాఖపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి సక్ష నిర్వహించలేదని విమర్శించారు. మట్టి తల్లిని అలుసుగా చూస్తూ వ్యవసాయాన్ని కర్మకు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయవచ్చని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న సౌకర్యాలు రైతులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ సందర్బంగా కవిత సూచించారు. రైతును రాజు చేసేందుకు తెలంగాణ రక్షణ సేన ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని వివరించారు. అన్నదాతల కష్టాలను, వారి గొంతుకను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నల్లగొండను వేదికగా ఎంచుకున్నట్లు టీఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కవిత స్పష్టం చేశారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయంతో పాటు.. రైతుకు గౌరవం ఇవ్వడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆమె ప్రకటించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కవిత ధ్వజమెత్తారు. పంట చేతికొచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదని.. మృగశిర కార్తె ప్రారంభమైనా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు విడుదల కాలేదని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అన్నదాతలు మళ్లీ అప్పులు, తాకట్టుల వైపు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోళ్లలో రవాణా భారాన్ని రైతులపైనే మోపడమే కాకుండా.. క్వింటాకు 6 కిలోల తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇప్పటివరకు వ్యవసాయ శాఖపై ఒక్క సక్ష కూడా నిర్వహించకపోవడం.. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడుసార్లు రైతు భరోసాను ఎగ్గొట్టారని, రుణమాఫీ కూడా పూర్తి కాలేదని.. కేవలం ఎన్నికల సమయాన్నే చూసి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. రైతులు పోరాటాలు చేస్తేనే ప్రభుత్వం నిద్ర లేస్తోందని కవిత దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కవిత ఆరోపించారు. జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని.. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నల్లగొండకు కూడా నీళ్లు ఇవ్వాలని కోరారు. మరోవైపు అసైన్డ్ ‌భూములకు హక్కులు కల్పిస్తామన్న హా ఎటు పోయిందని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే పెద్ద ఎత్తున అసైన్డ్ ‌భూములను కొనుగోలు చేస్తున్నారని.. ఆ భూముల రక్షణ కోసం రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు. ‘రైతు డిస్కం’ పేరుతో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు, విద్యుత్‌ ‌పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని హెచ్చరించారు.
తెలంగాణ రక్షణ సేన అనే ఈ కొత్త పార్టీకి, ప్రజల పక్షాన నిలిచే తమ పోరాటానికి ప్రజలందరూ సలహాలు, సూచనలు అందించి మద్దతుగా నిలవాలని కవిత కోరారు.  రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో 10 తీర్మానాలు ఆమోదించినట్లు కవిత తెలిపారు. రైతు డిస్కం వద్దని, యూరియా యాప్‌ ‌తీసేయాలని, బకాయి పడ్డ రైతు భరోసా తక్షణమే అందించాలని,  కౌలు రైతులను గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలని,  రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని,  మూసీ నదిలో కాలుష్యాన్ని నివారించాలని, నిమ్మ, బత్తాయి రైతులకు అండగా నిలవాలని, పత్తి రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలనపి,  రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో భవిష్యత్‌ ఉద్యమాలు చేయాలని తీర్మానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *