అవినీతి కేసులు ఎందుకు త‌గ్గ‌డంలేదు?

– కేవ‌లం గ‌ణాంకాల ప్ర‌ద‌ర్శ‌నే
– ప‌ట్టుబ‌డ్డ రూ.193కోట్ల ఆస్తుల్లో ప్ర‌భుత్వానికి చేరిందెంత‌?
– ప్ర‌త్యేక కోర్టులున్నా తీర్పుల్లో విప‌రీత జాప్యం

 

                                                                                     (వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్ )

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రతి సంవత్సరం వందలాది కేసులు నమోదు చేస్తోంది. లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు, కోట్లాది రూపాయల అక్రమాస్తులు, వరుస దాడులు, ప్రత్యేక కోర్టులు, భారీ గణాంకాలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. అయితే సాధారణ ప్రజల దృష్టిలో ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ సమాధానం కోసం ఎదురుచూస్తోంది. ఇన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ అవినీతి ఎందుకు తగ్గడం లేదు? ఇన్ని మంది అధికారులు పట్టుబడుతున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల సంస్కృతి ఎందుకు కొనసాగుతోంది? గడచిన రెండేళ్ల ఏసీబీ అధికారిక గణాంకాలను పరిశీలిస్తే అవినీతి తీవ్రత స్పష్టమవుతుంది. 2024లో ఏసీబీ 152 కేసులు నమోదు చేసి 223 మందిని అరెస్టు చేసింది. ఇందులో 129 ట్రాప్ కేసులు, 11 అక్రమాస్తుల కేసులు, 12 ఇతర అవినీతి కేసులు ఉన్నాయి. ఈ దాడుల్లో దాదాపు రూ.97 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. ఇక 2025లో కేసుల సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 199 కేసులు నమోదు కాగా 273 మంది అరెస్టయ్యారు. ఇందులో 157 ట్రాప్ కేసులు, 15 అక్రమాస్తుల కేసులు ఉండగా రూ.96 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ రెండు సంవత్సరాలు కలిపి చూస్తే 351 కేసులు, 496 మంది అరెస్టులు, దాదాపు రూ.193 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్యలు చూస్తే అవినీతి నిరోధక వ్యవస్థ బలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రజలు గమనిస్తున్నది మరో అంశం. ఏటా కేసుల సంఖ్య, అరెస్టులు, అక్రమాస్తుల విలువ పెరుగుతున్నా అవినీతి తగ్గకుండా కొనసాగుతోందనేది. ఒకవేళ అవినీతి నిజంగా తగ్గుతుంటే ఇంత పెద్ద సంఖ్యలో అధికారులు ఎందుకు పట్టుబడుతున్నారు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా నిపుణులు సూచిస్తున్న అంశం శిక్షల అమలులో తీవ్ర జాప్యం. ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం, దాడుల్లో కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడటం సంచలనంగా మారుతుంది కానీ, ఆ కేసు తర్వాత ఏమవుతుందనే విషయం ప్రజలకు తెలియడం లేదు. దర్యాప్తు పూర్తి కావడం, ప్రాసిక్యూషన్ అనుమతి కోసం ఫైళ్లు తిరగడం, చార్జిషీట్లు దాఖలు కావడం, కోర్టు విచారణలు, అప్పీళ్లతో సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఫలితంగా చట్టంపై భయం తగ్గిపోతున్న‌దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవినీతి కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్యకు అనుగుణంగా తీర్పులు రావడం లేదు. దీనికి కారణం శాఖల నుంచి అనుమతుల ఆలస్యం, సాక్షుల హాజరు సమస్యలు, తరచూ వాయిదాలు, న్యాయపరమైన అభ్యంతరాలు, అప్పీలు వంటి అంశాలు కూడా కేసులను నెమ్మదింపజేస్తున్నాయి. ఫలితంగా ప్రత్యేక కోర్టుల ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. అక్రమాస్తుల విషయంలో కూడా ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో బయటపడిన భూములు, బంగారం, నగదు, భవనాలు వెంటనే ప్రభుత్వ ఖజానాకు చేరవు. అవి ముందుగా కేసు ఆస్తులుగా నమోదవుతాయి. కోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వ స్వాధీనం కావచ్చు. అందువల్ల 2024, 2025లో గుర్తించిన దాదాపు రూ.193 కోట్ల ఆస్తుల్లో ఎంత మొత్తం ప్రభుత్వానికి చేరిందన్న విషయం స్పష్టంగా ప్రజలకు తెలియడం లేదు. ఇది కూడా వ్యవస్థపై అనుమానాలకు కారణమవుతోంది. పరిపాలనా నిర్లక్ష్యం కూడా మరో ముఖ్యమైన అంశం. ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత సంబంధిత శాఖలు వేగంగా స్పందించాల్సి ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో ఫైళ్లు నెలలు, సంవత్సరాలపాటు పెండింగ్‌లో ఉంటున్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగితే అది మొత్తం వ్యవస్థకు ప్రతికూల సంకేతంగా మారుతుంది.

రాజకీయ నాయకులపై కూడా తరచూ చర్చ జరుగుతోంది. అన్ని కేసుల ఆలస్యాలకు రాజకీయ జోక్యమే కారణమని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే కొంతమంది ప్రభావశీలుర లేదా ఉన్నతాధికారుల కేసులు ఎక్కువకాలం సాగుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది. అదే సమయంలో చిన్నస్థాయి ఉద్యోగులపై చర్యలు వేగంగా ఉంటున్నాయనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితే ప్రజల్లో అనుమానాలకు దారితీస్తోంది. అనుమానాలు త‌లెత్తకుండా పారదర్శకత పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. అవినీతి పెరగడానికి కేవలం వ్యవస్థాపరమైన లోపాలే కారణం కాదు. సమాజంలో వేగంగా ధనవంతులు కావాలనే తపన, విలాసవంతమైన జీవనశైలి, భూముల ధరల పెరుగుదల, అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే ధోరణి వంటి అంశాలు ఈ అవినీతికి కార‌ణాలు. అయితే ఈ అవినీతిని నియంత్రించే బాధ్యత చివరికి ప్రభుత్వ వ్యవస్థపైనే ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి నిరోధక వ్యవస్థ మొదటి దశలో బలంగా పనిచేస్తూ కేసులు, అరెస్టులు చేస్తోంది. కానీ రెండో దశలో అంటే వేగవంతమైన విచారణలు, శిక్షలు, అక్రమాస్తుల స్వాధీనంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. అందుకే ప్రజలు గణాంకాల కంటే ఫలితాలను కోరుతున్నారు. పట్టుబడిన వారిలో ఎంతమందికి శిక్ష పడింది? బయటపడిన ఆస్తుల్లో ప్రభుత్వ ఖజానాకుఎంత వచ్చింది? ప్రత్యేక కోర్టులున్నా కేసులు ఎందుకు సాగుతున్నాయి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోతే అవినీతి వ్యతిరేక పోరాటం అసంపూర్ణంగానే మిగులుతుంది. అవినీతి నిర్మూలనకు మరిన్ని దాడుల కంటే వేగవంతమైన న్యాయం అవసరం. లంచం తీసుకుంటూ పట్టుబడితే కొద్ది నెలల్లోనే శిక్ష పడే పరిస్థితి రావాలి. అక్రమాస్తుల స్వాధీనం ప్రక్రియ వేగంగా జరగాలి. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరనే నమ్మకం ఏర్పడినప్పుడే అవినీతిపరుల్లో భయం పెరుగుతుంది. లేకపోతే ఏటా కొత్త కేసులు, కొత్త గణాంకాలు వస్తూనే ఉంటాయి.. అవినీతి మాత్రం అదే స్థాయిలో కొనసాగుతూనే ఉంటుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *