– రోగాలు నయం చేస్తామని నమ్మించి డబ్బుల వసూలు
– ఇద్దరు నిందితుల అరెస్ట్
– రూ.30.50 లక్షల నగదు, సెల్ఫోన్లు, పూజా సామగ్రి స్వాధీనం
– వివరాలు వెల్లడించిన ఎస్సీ మహేష్ బి.గితే
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడులు, గుప్తనిధుల పేరుతో అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.30.50 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, క్షుద్రపూజలకు ఉపయోగించే బెల్లంతో తయారు చేసిన రెండు బొమ్మలు, పసుపు, కుంకుమ తదితర పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ఎస్పీ మహేష్ బి.గితే వెల్లడించారు. కరీంనగర్కు చెందిన తురుపాటి శ్యాం కుమార్, హైదరాబాద్లోని తూముకుంటలో భద్రకాళి పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తున్నాడు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన పత్తెం లక్ష్మీరాజం క్షుద్రపూజలు చేస్తానని చెప్పి అమాయకులను నమ్మించి డబ్బులు వసూలు చేసే విషయం శ్యాం కుమార్కు చెప్పగా, ఇద్దరూ కలిసి ఈ తరహా మోసాలకు పాల్పడేందుకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జనవరిలో హైదరాబాద్లోని ఉప్పల్ కు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శ్యాం కుమార్ దుకాణానికి పూజా సామగ్రి కోసం వెళ్లింది. ఆమెకు క్షుద్రపూజలపై నమ్మకం ఉన్న విషయాన్ని గమనించిన శ్యాం కుమార్.. పూజల ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాన్ని పూర్తిగా నయం చేయవచ్చని నమ్మించాడు. అగ్ర హారానికి చెందిన లక్ష్మీరాజం పెద్ద పూజారి అని, గతంలో ఎంతోమందికి నయం చేశాడని చెప్పి ఆమెను అతడి వద్దకు తీసుకెళ్లాడు.
సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద లక్ష్మీరాజాన్ని కలిసిన అనంతరం.. పూజా సామగ్రి కోసం రూ.10 లక్షలు అవసరమని ఆమెను నమ్మించి నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట వద్ద రూ.21 లక్షలు. కాశీలో రూ.13 లక్షలు నగదుగా తీసుకున్నారని, అలాగే శ్యాం కుమార్ సూచించిన బ్యాంకు ఖాతాలు, ఇతర ఖాతాలకు విడతల వారీగా సుమారు రూ.62 లక్షల వరకు డబ్బులు పంపించినట్లు విచారణలో వెల్లడైంది. అనారోగ్యం నయం కాకపోవడంతో బాధితురాలు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, నిందితులు క్షుద్రపూజలు, చేతబడులతో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలి పారు. అంతేకాకుండా ఆమె పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని వెలికితీసి ఇస్తామని చెప్పి మరి కొంతకాలం నమ్మించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో బెదిరింపులకు పాల్పడేందు కు తెల్ల కాగితాలపై ఆమెతో సంతకాలు కూడా చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 23న డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి సిరిసిల్ల పాత బస్టాండ్కు రావాలని బాధితురాలిని పిలిపించి, నిందితులు అక్కడికి రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి అగ్రహారంలోని లక్ష్మీరాజం ఇంటి వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30.50,000 నగదు, రెండు సెల్ఫోన్లు, రెండు బెల్లం బొమ్మలు, పసుపు, కుంకుమ తదితర పూజా సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను న్యాయస్థాన రిమాండ్కు తరలించారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని మోసం, నేరపూరిత విశ్వాస భంగం, బెదిరింపులకు సంబంధించిన నిబంధనలతో పాటు, ఔషధాలు మరియు మాయా చికిత్సల నివారణ చట్టంలోని ఏడో సెక్షన్ కింద సిరిసిల్ల పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గణేష్ తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ మహేష్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



