•కొనసాగుతున్న సహాయక చర్యలు
డెహ్రాడూన్, ప్రజాతంత్ర, మార్చి 1 : ఉత్తరాఖండ్‌లో కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన క్రమంలో ప్రమాదానికి గురైన వారిలో నలుగురు మృత్యువాత పడ్డారు. మంచుచరియలు విరిగిపడ్డ కారణంగా వాటిని తొలగిస్తున్న కార్మికుల్లో 55 మంది అక్కడే చిక్కుకుపోయారు. శుక్రవారం నుంచి కొనసాగుతోన్న సహాయక చర్యల్లో భాగంగా 50 మందిని ఆర్మీ రక్షించింది. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా.. జోషిమఠ్ దవాఖానలో చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇంకా ఐదుగురిని కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం మంచు చరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది. ఇది భారత్-టిబెట్ సరిహద్దులో మన దేశానికి చెందిన చివరి గ్రామం.
జాతీయరహదారిపై భారీగా పేరుకుపోయిన మంచుమేటలను సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది తొలగిస్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నిన్న 33 మందిని, ఈ రోజు 17 మందిని ఆర్మీ కాపాడింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌లో జోషిమఠ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భారత ఆర్మీ తెలిపింది. ఏటా శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడటం సాధారణమే. ఈ చరియలు 5 సెకన్ల కాలంలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారుకుంటాయి. ఇలాంటి ఘటనల్లో 2.3 లక్షల ఘనపు మీటర్ల వరకూ మంచు విడుదలవుతూ ఉంటుంది. అంటే 20 ఫుట్‌బాల్ మైదానాల్లో 3 మీటర్ల మందం వరకూ కప్పిన హిమంతో సమానమన్నమాట.





