మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
తెలంగాణ భవన్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు
హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్ 2 : తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ భవన్‌లో ఎవరున్నా లేకపోయినా.. శ్రీనివాస్ రెడ్డి ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఉండి పోయేవారు. జల దృశ్యం కావొచ్చు.. తెలంగాణ భవన్ కావొచ్చు.. ఎక్కడ్కెనా సమయ పాలన కచ్చితంగా పాటించేవారు. జల దృశ్యం టు తెలంగాణ భవన్..ఇదీ శ్రీనివాస్ రెడ్డి ప్రస్థానం అని హరీష్ రావు ప్రశంసించారు. చాలా మందికి రాజకీయాల్లోకి రావాలని ఉంటుంది. ఇలా వొచ్చే వారిలో ఒక్కొక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ మాదిరిగానే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రావాలనే ఆకాంక్షతో టీఆర్‌ఎస్‌లో చేరారు. జలదృశ్యంలో పార్టీ పెట్టాక మూడో రోజు శ్రీనివాస్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి కలిసి కేసీఆర్‌ను పరిచయం చేసుకున్నారు. 1999లో వెటర్నరీ ప్రొఫెసర్‌గా రిట్కెర్ అయ్యాను.. 1969లో తెలంగాణ కోసం పోరాడి జ్కెలుకు వెళ్లాను అని శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్‌కు చెప్పారు.
అప్పుడే బాగా కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి అని రామ్మోహన్ రెడ్డి కేసీఆర్‌తో అన్నారు. ఆ నిమిషం నుంచే ఆఫీసు సెక్రటరీగా మారిపోయారు శ్రీనివాస్ రెడ్డి. పార్టీతో నేటి వరకు 25 ఏండ్ల ప్రస్థానం శీనన్నది. ఆయనంటే అందరికీ గౌరవం. ఆయన ముఖంలో కోపం గానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, పరుషపదజాలం కానీ ఆయన నోట ఎప్పుడూ వినలేదు. 25 ఏండ్లలో ప్రేమ, చిరునవ్వు, ఓపిక, మంచినతం చూశాను తప్ప కోపం చూడలేదు అని హరీశ్‌రావు తెలిపారు. వెటర్నరీ కాలేజీ విద్యార్థి నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శ్రీనివాస్ రెడ్డి. చెన్నారెడ్డి నాయకత్వంలో ఉద్యమం చేసి జ్కెలుకు వెళ్లారు.
శ్రీనివాస్ రెడ్డి అంటే ట్రిపుల్ డీ.. డిటర్మినేషన్, డెడికేషన్, డీవోషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే డిటర్మినేషన్, బాధ్యతగా, నీతిగా, నిజాయితీగా పని చేయాలనే డెడికేషన్, కేసీఆర్ పట్ల ద్కెవంగా పని చేయాలనే డీవోషన్ శ్రీనివాస్ రెడ్డిలో ఉన్నాయి. కేసీఆర్ ఈజ్ రైట్.. మై బాస్ అనే డివోషన్‌తో ఉండేవారు శ్రీనివాస్ రెడ్డి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ పోరాటం, ఆమరణ నిరాహార దీక్షను దగ్గరుండి చూశారు. 2001 నుంచి ఒడిదొడుకులు, రాష్ట్ర సాధనలో వ్యూహాలు, కృషి, జేఏసీ ఏర్పాటుకు సాక్ష్యం కాబట్టి.. ఒక పుస్తకం రాయాలని శ్రీనివాస్ రెడ్డిని కోరుతున్నా. కేసీఆర్‌కు ఎంతో నమ్మకంగా పని చేశారు శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ కూడా భావోద్వేగానికి లోనయయ్యారు. వారికి తెలంగాణ భవన్‌లో, వరంగల్‌లో వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారని హరీశ్‌రావు తెలిపారు.