సమాజంలో ఎవరు ఏ పని చేసినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. సహకారం, ప్రోత్సాహంతో ఎవరైనా సరే ఎంత ముందుకైన వెళ్ళగలరు, లక్ష్యాన్ని సునాయసంగా సాధించగలరు అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . నిజమైన సామర్ధ్యం గురించి తెలుసుకున్న వారు ఎవరూ ఎవరినీ తక్కువగా చూడలేరు. అలా అర్ధం చేసుకోలేక గత కొన్ని తరాలుగా కొంత మందిని సామర్ధ్యం పేరుతో సమర్థులను కూడా అసమర్ధులుగా మార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్ధం చేసుకొనే సమాజం వైపు పయనించడానికీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రపంచంలో పనికి రాని వారంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వాల్లే ఉండరు. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే ‘‘ఒక వ్యక్తి కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, ఆ వ్యక్తి నిలబడడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు’’. వైకల్యం అనేది ఒక సంఘటన మాత్రమే కాని సమస్య కాదు, అంటు వ్యాధి అంతకన్నా కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్య పరచ వలసిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో, ప్రపంచ ఆధునిక అవిష్కరణలు ఆవిష్కరించడంలో వైకల్యం అడ్డు రాదని నిరూపించిన వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. లక్ష్యసాధనలో దివ్యాంగులు ముందుండాలి, ఇటీవల ఐ.ఏ.ఎస్. సాధించిన దివ్యాంగురాలైన (అంధులు) ప్రాంజల్ పాటిల్, ఒంటి కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా లను స్పూర్తి గా తీసుకొని ఇతరులకు స్ఫూర్తి గా నిలవాలి.
ఆత్మ విశ్వాసం నీ ఆయుధమైతే విధిని శాసించవచ్చు: ప్రపంచంలో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైనవాళ్ళే ఉండరు . అంగవికలురూ ఇతరులవలెనే అనెక పనులు సక్రమంగా చేయగలరని నిరూపణ చేస్తూనే ఉన్నారు. తెలివికి, తెలివిలేని తనానికి అంగవైకల్యానికీ సంబంధంలేదు. ఒకపని చేయగలగడం, చేయలేకపోవడం అనేవి వ్యక్తుల సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మరోటికాదు. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వసాధారణమై పోయింది. అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే ‘‘కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు’’.
వికలాంగులు దేంట్లోనూ తీసుపోరు. వారి ప్రతిభ అనూహ్యమైనది. అసలైన వికలాంగులు: అన్నీ ఉండి ఇతరులకోసం ఏమీ చేయడానికి ముందుకు రాని వారు మానసిక వికలాంగులు (మెంటల్లీ డిసేబుల్డ్), కాళ్ళూ చేతులూ ఉండీ ఇతరుల కోసం ఏ సేవా చేయని వారు ఫిజికల్లీ హేండీకాప్డ్ , కళ్ళుండీ ఇతరుల మంచి చూడలేని వారూ, మన తోటి వారికి అవసరమైన సహాయమేం టో చూడలేనివారు నిజమైన బ్లైండ్ పీపుల్. ఇతరుల ఉన్నత స్థితికి బాధ పడి ఏడ్చేవారు, మెంటల్లీ రిటార్డెడ్, అన్నీవయవాలూ సరిగా ఉండీ శ్రమ చేయగల శక్తి సామర్ధ్యాలుండీ సోమరిగా ఉండే వారే అసలైన వికలాంగులు. మనలో ఉన్న ఇలాంటి అంగవైకల్యాన్ని మనంతట మనం సరిదిద్దుకోవాలి.
సామాజిక భాద్యత: వైకల్యంతో పుట్టిన శిశువుకు చేసే ప్రతి సేవను భగవంతునికి ప్రత్యక్షంగా చేసిన సేవగా సమాజం భావించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చదువుకోవడానికి అనువైన పరిసరాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కల్పించాలి. పిల్లలలో నెగెటివ్ ఆలోచనలను దరి చేరనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దివ్యాంగులలో స్వతంత్రంగా జీవించడానికి కావలిసిన అన్ని సహాయ సహాకారాలను తల్లిదండ్రులు అందించేలా చూడాలి. అలా స్వతంత్రంగా జీవించగలిగితే వారికి వారిపై ఆత్మవిశ్వాసం పెంపొందించబడి జీవన నైపుణ్యాలు అభివృద్ది చెందుతాయి. ఎందరో దివ్యాంగులు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారి విజయగాధలను చెప్పడం ద్వారా, వీడియో క్లిప్పింగ్ లు చూపడం ద్వారా లక్ష్యాన్ని స్తీరీకరించుకోవడానికి దోహదపడుతుంది. దివ్యాంగులలో తమ తప్పులను, అపజయాలను సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు సరైన ప్రోత్సహాన్ని అందించాలి.
సైకాలజిస్ట్ ద్వారా లక్ష్యనిర్దారణ, ఆత్మ విశ్వాసం, మనో దైర్ఘ్యాన్నినింపే విధంగా కౌన్సెలింగ్ ఇప్పించాలి, తద్వారా జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను తనకు తానుగా పరిష్కరించుకోగలుగుతాడు. ప్రభుత్వ పథకాల ద్వారా వివిధ రకాల సేవలు, పింఛన్, ఉపకారవేతనాలు, రవాణా సౌకర్యాలు, రిజర్వేషన్, విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు చైతన్యం చేయాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక పాఠశాలలు (అంధుల పాఠశాల, మూగ చెవిటి, మానసిక వికలాంగుల) ప్రభుత్వం ఏర్పాటు చేయవలిసిన అవసరం ఉంది. దివ్యాంగుల ప్రతిభ అనూహ్యమైనది: పుట్టుకతో వికలాంగులైన వారికి ప్రత్యేకమైన శక్తులుంటాయనే విషయమూ నిరూపించిన వారెందరో. చూపులేనివారు ఒక మారు విన్న స్వరాన్ని మరోమారువినగానే ఆవ్యక్తిని గుర్తిస్తారు. ఒక మారు స్పర్శ తగిలిన వారినీ రెండోమారు గుర్తించగలుగుతారు. వారికి గ్రహణ శక్తీ అధికంగానే ఉంటుంది. వికలాంగులు మానసికంగా ఆధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసు కెళుతున్నారు. దివ్యాంగులకు చెయూత నిద్దాం.. వారికి గౌరవాన్ని అందిద్దాం, ఆదరిద్దాం, వారిలో దాగి ఉన్న అధ్భుత శక్తులు ప్రపంచానికి తెలిసేలా చేద్దాం.
-డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి,
స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్, సైకాలజిస్ట్
ఫ్యామిలీ కౌన్సెలర్ , సెల్: 9703935321.