ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

– అంగన్‌వాడీల్లో నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం
– మంత్రి ఆదేశాలతో సిబ్బందికి రేపు ప్రత్యేక శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసే పోషకాహార సేవలను మరింత నాణ్యంగా, సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అంగన్‌వాడీ సేవల బలోపేతం, ఆహార భద్రత ప్రమాణాల కచ్చితమైన అమలుపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలు, పంపిణీ వ్యవస్థ తదితర అంశాలపై మంత్రి సీతక్క స్వయంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ సమీక్షలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార భద్రతపై అంగన్‌వాడీ సిబ్బందికి మరింత అవగాహన కల్పించేందుకు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను పురస్కరించుకుని ఈ ఆదివారం (7వ తేదీ)రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ శిక్షణలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాల సేకరణ, నిల్వ, వంట ప్రక్రియ, పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ, లబ్ధిదారులకు సురక్షితమైన పోషకాహారం అందించే విధానాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కోసం జిల్లాల వారీగా ఫుడ్ సేఫ్టీ అధికారులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించారు. వారు అంగన్‌వాడీ సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యక్ష శిక్షణ అందించనున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫఎసఎసఏఐ) మార్గదర్శకాల ప్రకారం వీరు శిక్షణ ఇస్తారు. వరల్డ్ ఫుడ్ సేఫ్టి డే స్ఫూర్తితో ఆహార భద్రత ప్రమాణాలను మరింత పటిష్ఠం చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఆహార భద్రత ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *