– ఈ ఏడాది వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం
– ఖరీఫ్ సాగు ప్రణాళిక సమావేశంలో మంత్రి తుమ్మల
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 3 : వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ భారత వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. జిల్లాలోని జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న డెడ్ స్టోరేజ్ నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, పచ్చి రొట్ట విత్తనాలను సబ్సిడీపై అందజేయనున్నట్లు పేర్కొన్నారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటలను రైతులు సాగు చేయాలని సూచించిన మంత్రి ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతులు సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, మార్కెటింగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. దేశం లోని అనేక రాష్ట్రాలు మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు, సోయాబీన్ వంటి పంటలను కొనుగోలు చేయకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌తో పాటు 65 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరగడానికి డీజిల్ కొరత, బంగ్లాదేశ్ పరిస్థితుల కారణంగా గన్నీ బ్యాగుల సరఫరాలో అంతరాయం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత, లోడింగ్-అన్‌లోడింగ్ సమస్యలు వంటి పలు కారణాలు ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గిడ్డంగుల సామర్థ్యాలను పెంచకపోవడం, పాత నిల్వల సమస్యలు కూడా ప్రభావం చూపాయని తెలిపారు. అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఉద్యాన పంటలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, కల్లూరు ఫ్యాక్టరీ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగును విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. దేశంలో పత్తి సాగు పెద్దఎత్తున జరుగుతున్నప్పటికీ విదేశాల నుంచి పత్తి దిగుమతులు చేయడం రైతులకు నష్టం కలిగిస్తోందన్నారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించడం వల్ల దేశీయ రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేదన్నారు. పురుగుమందుల అధిక వినియోగం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మాత్రమే ప్రపంచ మార్కెట్లలో పోటీ పడగలమన్నారు. రైతులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయ పద్ధతులు, నానో యూరియా వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారం తరచూ ఉత్పత్తి నిలిపివేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఖమ్మం జిల్లా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. జిల్లాలో అనేకసార్లు అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది రైతులు వరి కొయ్యలు, పంట అవశేషాలను కాల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పక్కనే ఉన్న పంటలు, తోటలకు నష్టం వాటిల్లడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా సంభవించిందన్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ‘సుడా’ చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





