సూపర్ ఎల్ నినోతో అప్రమత్తంగా ఉండాలి

* తాగునీటి పరిరక్షణకు ముందస్తు చర్యలు అవసరం
– రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి
– యూరియా పంపిణీకి పారదర్శక వ్యవస్థ
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 22 :సూపర్ ఎలినినో ప్రభావం 1977 కరవు కంటే తీవ్రంగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భూగర్భ జలాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున తాగునీటిని పొదుపుగా వినియోగించాలని, రైతులు అధిక నీటి అవసరమున్న పంటలకు బదులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఖమ్మం అర్బన్లోని వి.వెంకటాయపాలెం డీప్ క‌ట్‌ వద్ద గోదావరి జలాల పరిస్థితిని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై తాగునీటి సంరక్షణ, గోదావరి జలాలను ఖమ్మం వైపు మ‌ళ్లించే కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పరిమితంగా ఉన్నందున ప్రతి చుక్క నీటిని పొదుపుగా వినియోగించా లని మంత్రి సూచించారు. రైతులు వరి, మిర్చి వంటి అధిక నీటి అవసర మున్న పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని కోరారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు జిల్లాకు అందుతున్నాయని, రాజీవ్ కాలువ షట్టర్లను మూసివేసి నీటిని తిరిగి ఖమ్మం వైపు మళ్లించే ప్రయోగం కొనసాగుతోందన్నారు. అవసరమైతే డీప్కట్ నుంచి మంచుకొండకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పశ్చిమా సియా యుద్ధాల ప్రభావంతో యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్న మంత్రి, రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టిం దన్నారు. రాజకీయ ప్రచారాలను నమ్మకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగిస్తూ జూన్-2027 వరకు తాగునీటి అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొం దించామని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగు కష్టతరమవుతుందని హెచ్చరిస్తూ, అధికారులు సూచిస్తున్న ప్రత్యామ్నాయ పంటలనే సాగు చేయాలని రైతులకు సూచించారు. అనంతరం మంత్రి ఖమ్మం నగరం లోని 3, 4, 5 డివిజన్లలో యూఐడీఎఫ్ నిధులతో రూ.175 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువాళ్ళ దుర్గాప్ర సాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, సిఇ ఇర్రిగేషన్ శ్రీనివాస రెడ్డి, ఎం. వెంకటేశ్వర్లు, డీపీఓ రాంబాబు, వివి పాలెం గ్రామ సర్పంచ్ కాపా ఆదినారాయణ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *