– ఆయనకు నిజమైన గౌరవం దక్కింది బీజేపీ హయాంలోనే
– దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న బీజేపీ
– పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దళితులు తమకే ఓటేస్తారనే భావనతో రాజకీయాలు చేస్తూ వచ్చింది.. అయితే డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే. ఆయనను ఎన్నికల్లో ఓడించడమేకాక భారతరత్న పురస్కారాన్ని కూడా ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ కి నిజమైన గౌరవం దక్కింది బీజేపీ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తుచేశారు. ఆయన జన్మస్థలం (మహూ), చదువుకున్న స్థలం (లండన్), దీక్షా భూమి (నాగ్‌పూర్), మహా పరినిర్వాణ భూమి (ఢిల్లీ), చైత్య భూమి (ముంబై)లను పంచతీర్థాలుగా అంతర్జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. లండన్‌లో డాక్టర్ అంబేద్కర్ చదువుకున్న ఇంటిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేసిందని, అంబేద్కర్ వారసత్వ పరిరక్షణలో బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేసిందని వివరించారు. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమం, సాధికారత కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దళితులను బీజేపీకి దూరం చేయడానికి అనేక కుట్రలు జరిగాయని, ఒక అభ్యర్థి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందన్నారు. రిజర్వేషన్లను సమర్థిస్తూ, వాటిని పరిరక్షించిన పార్టీ బీజేపీయే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని దళితులకు కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల ప్రయోజనాలు అందేలా చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. దేశ అత్యున్నత పదవులకు సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవిని, దళిత వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్రపతి పదవిని కల్పించిన పార్టీ బీజేపీయేనని రామచందర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై అన్యాయం పెరిగాయన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో అనేక బస్తీలను తొలగించి అక్కడ నివసిస్తున్న పేద దళిత కుటుంబాలకు సరైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం వుందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.. ఎక్కువమంది దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ తరఫున గెలిచేలా కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలి.. కేంద్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
వరంగల్ ఎయిర్‌పోర్ట్ కు క్లియరెన్స్ ఇచ్చింది కేంద్రమే
– కేంద్ర ప్రభుత్వ కృషిని రేవంత్ వివరించాలి
వరంగల్ (మామునూరు) ఎయిర్పోర్ట్ ఏర్పాటు, అభివృద్ధి వెనుక ఉన్న అసలు వాస్తవాలను దాచిపెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆక్షేపించారు. తెలంగాణకు మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే అందరికంటే ఎక్కువగా సంతోషించేది బిజెపి పార్టీయేనని, అయితే ప్రజలకు దీని వెనుక ఉన్న పూర్వాపరాలను, కేంద్ర ప్రభుత్వ కృషిని వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వరంగల్ ఎయిర్పోర్ట్ కల సాకారమయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘ఉడాన్’ ద్వారా దేశంలో విమానాశ్రయాల సంఖ్య 75 నుండి భారీగా పెరిగిందని, ఇందులో భాగంగానే వరంగల్ ఎయిర్పోర్ట్‌కు ఉన్న 150 కి.మీ నిబంధన (వేవర్) క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి సాధించిందని వివరించారు. గత ప్రభుత్వాలు భూసేకరణ చేయకపోవడం వల్లే వరంగల్ ప్రాజెక్ట్ ఆలస్యమైందని తెలిపారు. ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి పూర్తి సహకారం ఉంటుందని, భవిష్యత్తులో తమ వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాశీచందర్ రావు హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




