– ప్రారంభమైన ఆషాఢ బోనాల ఉత్సవాలు
– అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, ప్రభాకర్
– వర్షాలు సమృద్దిగా కురవాలి : సురేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : గోల్కొండ జగదాంబిక అమ్మవారి దయతో ఎల్‌నినో ప్రభావం తగ్గి వర్షాలు సమృద్దిగా కురవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నదన్నారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని లంగర్ హౌజ్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రికి అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి అమ్మవారికి ఆమె పట్టువస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కళాకారుల కోరిక మేరకు మంత్రి సురేఖ ఈరగోల చేతిలో ధరించి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాఢ బోనాల ఉత్సవాల బుక్‌లెట్‌ను మంత్రి పొన్నం తో కలిసి సురేఖ ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల చెక్కును మంత్రులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని చెప్పారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. జగదాంబిక అమ్మవారి బోనాల సమర్పణతో భూతల్లి శాంతించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద దేవాలయాతోపాటు, చిన్నచిన్న దేవాలయాలకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా అమ్మవార్లను దర్శించుకుని వెళ్లేలా సకల ఏర్పాట్లను చేసినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





