గోదావరి జలాలపై ప్రత్యేక ప్రణాళిక

– చివరి ఆయకట్టుకూ నీరందించడమే లక్ష్యం
– ప్రజా ప్రభుత్వంలో పైసా వృథా కాకుండా ‘సీతారామ’ పూర్తి
– సీతారామపై క్షేత్రస్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా గరిష్ఠంగా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళుతున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా వస్తున్న వాతావరణ మార్పులు, విపత్కర పరిస్థితులను తట్టుకునేలా ముందే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. మూడు రోజుల క్రితం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సమ్మక్క బారేజ్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని పూర్తిస్థాయిలో లిఫ్ట్ చేసేందుకు అన్ని పంపులను ఆన్ చేయడమే కాక దాదాపు 12 జిల్లాలు, 17 నియోజకవర్గాలకు సంబంధించి 22 రిజర్వాయర్లను నింపే కార్యక్రమానికి స్వయంగా అక్కడే ఉండి సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు వద్దకు వచ్చి సమీక్షించి ఎక్కడికక్కడే ఆదేశాలు ఇస్తూ పనులు వేగవంతం చేసే ప్రక్రియ చేపట్టామన్నారు.

తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై ఉన్న ఈ ప్రాజెక్ట్టును త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆనాడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి జలాలను జిల్లా రైతులకు అందించాలనే ఉద్దేశంతో లోతుగా అధ్యయనం చేసి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారంటూ అప్పుడు ఇదే స్థానం నుంచి పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టును రూ.1,681 కోట్లతో రెండు లక్షల ఎకరాలకు నీరందించేలా ప్లాన్ చేశారన్నారు. గోదావరి – శబరి నదులు కలిసే ప్రాంతం రుద్రంకోట వద్ద ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రూ.1,824 కోట్లతో మరో రెండు లక్షల ఎకరాలకు నీరందించేలా పనులు ప్రారంభించారని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం రూ.1,505 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ఈ ప్రాజెక్టులను కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో రీడిజైనింగ్ చేసిందన్నారు. ఈ కారణంగా సీతమ్మ సాగర్ బ్యారేజ్‌తో కలుపుకుని దాదాపు రూ.24,000 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని, అందులో దాదాపు రూ.7,500 నుంచి రూ.8,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందని వివరించారు. పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా తాను సభలోనూ, బయటా వివరాలతో ఈ దోపిడీని ఎండగట్టామన్నారు. ఆనాడు రెండు ప్రాజెక్టులను పూర్తి చేయమని చెప్పినా వినకుండా కేసీఆర్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేబినెట్ మొత్తం కలిసి ఈ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్ష చేసి ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి ప్రాజెక్టును ఆపడం సరికాదని, దీనిని కొనసాగించి పూర్తిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకపోవడం, రిజర్వాయర్ల కెపాసిటీ సమస్యలను సరిదిద్దుతూ, సాగర్ కెనాల్‌తో లింక్ చేస్తూ రాజీవ్ కెనాల్‌ను కలపడం, వైరా రిజర్వాయర్, పాలేరు రిజర్వాయర్‌లను లింక్ కెనాల్స్, టన్నెల్స్ ద్వారా నింపే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సత్తుపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేలా పనులను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు నెలవారీ క్యాలెండర్‌ను ఏర్పాటు చేసుకొని సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తన్నట్లు  చెప్పారు. ఇది ప్రజల ప్రభుత్వం.. ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా, జరిగిన పనులను ముందుకు తీసుకు వెళుతూ ప్రాధాన్యతగా తీసుకుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టంగా ప్రకటించారు. గోదావరి నదిలో చివరన ఉన్న ఈ ప్రాజెక్టు నుండి గరిష్ఠంగా నీటిని తీసుకుని జిల్లా రైతాంగ ఆశలను నెరవేరుస్తామని విస్పష్టంగా ప్రకటించారు.

ఓట్లు- సీట్లు ఇవ్వలేదని బీఆర్‌ఎస్ కక్ష: మంత్రి పొంగులేటి 

బీఆర్‌ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడూ సరిగా ఆదరించడంలేదనే కక్షతో అత్యంత కీలకమైన సీతారామ ప్రాజెక్టుతోపాటు పలు నీటి ప్రాజెక్టులను ఆ పార్టీ నాయకులు గాలికి వదిలేశారని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఆయన గురువారం సందర్శించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పరిస్ధితిని చూస్తే కడుపు తరుక్కుపోతోందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఈ ప్రాంతీయులు ఓట్లు వేసి సీట్లు ఇవ్వనందున గిరిజనులు అధికంగా ఉండే కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఉపయుక్తమైన సీతారామ ప్రాజెక్టుకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులకు మహర్ధశ పట్టినట్లే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ వాటిని దశలవారీగా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి భేషజాలకు, పట్టుదలకు పోకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పు చేసినా సీతారామ ప్రాజెక్టుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సరిదిద్దే తపనతో పనిచేస్తున్నామని, వారు కట్టారని కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయలేమని అన్నారు. గిరిజనులకు ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టుల ప్రాధాన్యత గుర్తించి ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఉన్న నిధులను బీఆర్‌ఎస్ పెద్దలు కొల్లగొడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేస్తూ మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగం కుంటుపడకుండా చర్యలు చేపడుతున్నామని, సీతారామ ప్పు్రాక్టుకు గతంలో రూ.115 కోట్లT మాత్రమే ఖర్చు చేసి వదిలేశారని చెప్పారు. ఇప్పుడు నిధులిస్తూ 1480 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఖమ్మం, వైరా, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు తాగునీటిని కూడా అందిస్తున్నామన్నారు. 1.25 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తూ కరవు వచ్చినా కాపాడేలా చేస్తున్నామని, అవసరమైతే అదనంగా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్‌ఎస్ పెద్దలు కడుపులో విషం పెట్టుకుని అబద్ధాలతో కాలంగడుపుతున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రజల కష్టం గుర్తించని నాటి పెద్దలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నదో చూస్తూ జ్ఞానం తెచ్చుకోవాలి అని మంత్రి పొంగులేటి హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *