– తేజస్వి సూర్య, బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరానా నిండి ఉన్నదంటూ పార్లమెంటు సాక్షిగా ఆ పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, వారికి తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ మొదలుకుని ఈరోజు ఎంపీ తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారన్నారు. దీనిని తెలంగాణ సమాజం గుర్తపెట్టుకుంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాలపాటు సాగిన పోరాటం, వేలాదిమంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా ఎనిమిదిమంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కనీసం kవష్ట్ర నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు సైతం తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణమన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని సమాజం గమనిస్తోందన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బీజేపీ¾ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




