– పనివాళ్ల ఫిర్యాదుతో బయటపడ్డ వైనం
చండీఘడ్, జూన్ 12: హనీట్రాప్ లో పడి ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. అయితే దీనిపై ఆమె స్వయంగా ఫిర్యాదు చేయకుండా తన ఇంట్లో పనిచేసే వాళ్లతో ఫిర్యాదు చేయించడం చర్చనీయాంశమైంది. హరియాణాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తికి గతేడాది నవంబరులో టిండర్ యాప్ ద్వారా అభిమన్యు వశిష్ఠ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే వీరి మధ్య బంధం బలపడింది. కొంతకాలం తర్వాత పెట్టుబడి పెడితే అధిక రాబడులు వస్తాయని మహిళా న్యాయమూర్తిని నమ్మించిన అభిమన్యు ఆమెతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించాడు. ఈమేరకు అతడికి సంబంధించిన ఖాతాలకు ఆమె రూ.52 లక్షలకు పైగా బదిలీ చేశారు. ఎన్నాళ్లయినా లాభాలు రాకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించారు. అయితే దీనిపై ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తన ఇంట్లో పనిచేసే సహాయకురాలి పేరు మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కింది కోర్టు బెయిల్ నిరాకరించడంతో అభిమన్యు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా లావాదేవీలు సహాయకురాలి బ్యాంకు నుంచి కాకుండా న్యాయమూర్తి ఖాతాల నుంచి జరిగాయని అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ గుర్తించారు. దర్యాప్తులో కూడా లోపాలు ఉన్నాయన్నారు. నిందితుడు, న్యాయమూర్తికి సంబంధించిన పూర్తి వాట్సప్ సంభాషణలను, కాల్ రికార్డులు సేకరించలేదని తెలిపారు. దర్యాప్తు అసంపూర్తిగా ఉన్నందున కీలకమైన సాక్ష్యాలు ఇంకా సేకరించాల్సి ఉందని పేర్కొంటూ నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. టిండర్ యాప్, వాట్సప్‌లలో ఇరువురి మధ్య జరిగిన పూర్తి సంభాషణలను సేకరించాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. నిధుల బదిలీకి వివరాలు.. నిందితుడి ఫోన్‌కి సంబంధించిన ఫోరెన్సిక్ విశ్లేషణను త్వరగా నిర్వహించాలని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

