అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ
ముగ్గురు చిరు వ్యాపారులు దుర్మరణం
వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ -బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో రోడ్డు ప్రమాదంలో ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొట్టి ఆగింది. లారీ డ్రైవర్ మాత్రం క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న ఈ లారీ ఢీకొట్టడంతో చెట్టు నేలకూలింది.
ఈ ఘటనతో హైదరాబాద్- బీజాపుర్ రహదారిపై భీతావహ వాతావరణం నెలకొంది. లారీ సృష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు వంద టర్ల దూరం నుంచే లారీ అదుపు తప్పిన విషయాన్ని గమనించిన కూరగాయల వ్యాపారులు పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కూలిన చెట్టును జేసీబీతో పక్కకు తొలగించారు. ఘటనా స్థలానికి కి.ల దూరంలో ఆదివారం కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని బీడీఎల్ ఉద్యోగి దంపతులు దుర్మరణం చెందారు. వరుస ప్రమాదాలతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డును విస్తరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.