డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్యం
నేడు పార్లమెంట్ కాంప్లెక్స్ ముట్టడికి రైతు సంఘాల పిలుపు
న్యూదిల్లీ, నవంబర్ 2 : కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ కాంప్లెక్స్ ముట్టడికి రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం యూపీ రైతులు నోయిడా నుంచి దిల్లీకి మార్చ్ నిర్వహించారు. రైతుల ఆందోళనతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల పాదయాత్రతో భారీగా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లపై రైతులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.
వారితో చర్చలకు సైతం సుముఖత చూపడం లేదు. దీంతో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతుల డిమాండ్ల సాధనకు ఈ నెల 6న దేశ రాజధాని దిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని పంజాబ్‌కు చెందిన రైతు నేత శర్వణ్ సింగ్ పంధేర్ పిలుపునిచ్చారు. దేశంలోని రైతులందరూ వారి నేతలు, సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్రగా దిల్లీకి కదిలిరావాలని కోరారు.
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని భద్రతా దళాలు ఫిబ్రవరి 13న నిలిపివేయడంతో వారు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరి ప్రాంతాల్లో నిలిచిపోయారని పంధేర్ ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. శంభు, ఖనౌరిలలో రైతులు 293 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారన్నారు.