- రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ఫ్యాక్టరీ ప్రారంభం
- రూ. 2,091 కోట్లతో 49 ఎకరాల్లో భారీ పరిశ్రమ
- వేలాది మందికి ఉపాధి అవకాశాలు..
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ప్రపంచ స్థాయి పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బండ తిమ్మాపూర్‌లో హెచ్‌సిసిబి పెట్టుబడులు ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ ఖ్యాతిని నొక్కి చెబుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లో ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.బండ తిమ్మాపూర్‌లో హెచ్‌సిసిబి పెట్టుబడులు, ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులు తెలంగాణ ఖ్యాతిని చాటిచెబుతున్నదని అన్నారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.సమగ్ర విధానం అనుసరిస్తున్న హెచ్‌సిసిబిని మేం అభినందిస్తున్నామనీ, ఇది ఉద్యోగాలను తెస్తుందని, కమ్యూనిటీలను ఉద్ధరిస్తుందనీ, ఈ ప్రాంతం అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని అన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బండ తిమ్మాపూర్‌లో హెచ్‌సిసిబి పెట్టుబడులు పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసి ఎలా సాగుతాయనేదానికి ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తాయన్నారు. ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ తెలంగాణ పారిశ్రామిక, పర్యావరణ అనుకూలవృద్ధి, సంపదకు తోడ్పడనుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… బండ తిమ్మాపూర్‌లోని హెచ్‌సిసిబి గ్రీన్‌ఫీల్డ్ సదుపాయం పారిశ్రామిక పురోగతి, సమాజ అభివృద్ధికి మధ్య ఉన్న సమన్వయానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి ఇది గొప్ప ఉదాహరణ అని అన్నారు. పునరుత్పాదక ఇంధనం, నీటి పునర్వినియోగం వంటి పర్యావరణ అనుకూల సాంకేతికతలతో ఈ ఫ్యాక్టరీ తెలంగాణలో పర్యావరణ బాధ్యత కలిగిన తయారీకి మార్గదర్శనం చేస్తుందన్నారు. హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ…’’హెచ్‌సిసిబి వృద్ధి ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.
ఈ ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ట్యాపింగ్ పాయింట్ కనెక్షన్, మిషన్ భగీరథ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపరితల నీటి పైప్‌లైన్‌ను పూర్తి చేయటం ,మా ఫ్యాక్టరీ కార్యకలాపాలకు విద్యుత్ లభ్యత కోసం త్వరిత అనుమతి ఇచ్చారని తెలిఆరు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఈ నూతన గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ లో మా ఉత్పత్తిని ప్రారంభించటానికి అవి తోడ్పడ్డాయన్నారు. తెలంగాణలో అనేక రకాల సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పరివర్తనాత్మక మార్పును హెచ్‌సిసిబి కొనసాగిస్తుందన్నారు. సంస్థ కార్యక్రమాలు 1,73,000 మంది లబ్ధిదారులపై ప్రభావం చూపాయి, వీటిలో యువతకు సేల్స్, మార్కెటింగ్ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం , డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించటం వంటివి ఉన్నాయి.
హెచ్‌సిసిబి పలు పాఠశాలల్లో వాటర్ ఏటిఎం లు, స్మార్ట్‌బోర్డ్‌లను ఏర్పాటు చేయడంతో స్వచ్ఛమైన నీరు విద్యకు అవకాశాలను మెరుగుపరిచిందన్నారు. అదనంగా, పర్యావరణ అనుకూల వ్యవసాయం, పారిశుద్ధ్యం, ఆరోగ్యంలో సంస్థ యొక్క ప్రయత్నాలు వేలాది స్థానిక కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చాయి. హెచ్‌సిసిబి వ్యూహాత్మక భాగస్వామ్యాలను సైతం ఏర్పాటు చేసింది. వీటిలో, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) భాగస్వామ్యం తో క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్ కింద 10,000 మంది కళాశాల విద్యార్థులకు ఉద్యోగ సన్నద్ధతలో శిక్షణ ఇవ్వనుంది. వీరిలో , గ్రామీణ ప్రాంతాల నుంచి 70% కు పైగా ఉండనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో ఎమ్‌ఒయు కుదుర్చుకుని నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ మరియు నైపుణ్యాన్ని పెంపొందించడంలో దీర్ఘకాలిక కార్యక్రమాలు సైతం హెచ్‌సిసిబి నిర్వహిస్తుంది. ఈ సమగ్ర ప్రయత్నాల ద్వారా, తెలంగాణ అంతటా ఉన్న కమ్యూనిటీలకు శాశ్వత సానుకూల ప్రభావాన్ని నిర్ధారిస్తూ, ఈ ప్రాంతం యొక్క స్థిరమైన వృద్ధికి హెచ్‌సిసిబి దోహదపడుతోంది.
ఇదిలా ఉంటే, మొత్తం రూ. 2,091 కోట్ల (యుఎస్ 251 మిలియన్ డాలర్లు) పెట్టుబడిలో భాగమైన 49 ఎకరాల ఫ్యాక్టరీ. దీంతో తెలంగాణలో మొత్తం 3, 798 కోట్లు ( యుఎస్ 455.5 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టడంతో పాటుగా 1000 మందికి ఉపాధి అవకాశాలను హెచ్‌సిసిబి కల్పించిందన్నారు. భారతదేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) కి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి, 49 ఎకరాల్లో నిర్మించబడిన ఈ కర్మాగారం మొత్తం రూ. 2,091 కోట్ల (యుఎస్ 251 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతోంది.
ఇందులో రూ. 1,409 కోట్లు (యుఎస్ 170 మిలియన్ డాలర్లు) ప్రస్తుత దేశం కోసం ఇప్పటికే ఉపయోగించబడింది. ఈ సదుపాయం 7 అధునాతన ఉత్పత్తి మార్గాలను నిర్వహిస్తుంది. 410 మంది వ్యక్తులకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని కల్పించడానికి సిద్ధంగా ఉంది. తిమ్మాపూర్‌లోని కొత్త ఫ్యాక్టరీ అధునాతన సాంకేతికతలు, పర్యావరణ స్పృహతో కూడిన పద్ధతులను అనుసరించనున్నారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ల నుంచి పునరుత్పాదక శక్తి కార్యక్రమాల వరకు, ఇది దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రాధాన్యతనిస్తుంది. పర్యావరణ అనుకూలమైన శీతలీకరణ వ్యవస్థలు, నీటి పునర్వినియోగ పద్ధతులు, క్లీనర్ ఎనర్జీ సొల్యూషన్‌ల వంటివి పర్యవారణం పట్ల హెచ్‌సిసిబి అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.