– రైతులను వంచించిన రేవంత్, రాహుల్
– రైతు భరోసా రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?
– రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైంది?
– కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ పార్టీ
– కాంగ్రెస్‌కు పిండం పెడితేనే రైతులకు న్యాయం
– రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ధ్వజం
వరంగల్, ప్రజాతంత్ర, మే 6: రైతు డిక్లరేషన్ ఒక బోగస్ పత్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. హనుమకొండలో బుధవారం నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ డిక్లరేషన్ అమలుకు రైతులు కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి నిలదీయాలన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని పంటలకు బోనస్ ఇచ్చి కొంటామన్నారని గుర్తుచేశారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.14వేలు వస్తుందా, రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ జరిగిందా అని అడిగారు. పంట బీమా పథకం ఎక్కడకు పోయిందన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఎప్పుడిస్తారన్నారు. కాంగ్రెస్‌ది మెగా రైతు మేళా కాదు.. దగా రైతు మేళా అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అని సెటైర్ వేశారు. డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే సమయంలో రైతుబంధు క్రమం తప్పకుండా పడేదని, ఈ పథకాన్ని 12 రాష్ట్రాలు కాపీ కొట్టాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతుబంధు సమయానికి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పిండం పెట్టండి.. రైతులకు మంచి రోజులు వస్తాయి అని అన్నారు. తాలు తీస్తే రైతులు నీ తోలు తీస్తారని, మక్కలు కొనకపోతే నీ ప్రభుత్వం వెయ్యి ముక్కలవుతుందని రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకెప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని సూచించారు. రూ.50వేల కోట్ల రుణ మాఫీ చేస్తానని సీఎం చెప్పారని, కానీ రూ.12వేల కోట్లు మాత్రమే చేశారని ధ్వజమెత్తారు. ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్‌కు రైతన్నల ప్రతాపం చూపించే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. సమ్మక్క-సారలమ్మ జాతరలో రూ.70 కోట్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క కొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దండుపాళ్యం బ్యాచ్‌లా రేవంత్‌రెడ్డి అండ్ కో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఇన్నాళ్లూ చేసినవి తప్పుడు ఆరోపణలని తేలిపోయిందని.. ఇకపై ఆరోపణలు చేస్తే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు.. ధాన్యం కొనుగోలు తెలియదు.. బస్తాల్లో డబ్బులు మోసేది తెలుసు.. యూరియా బస్తాలు ఇచ్చేది తెలియదు అని కేటీఆర్ విమర్శించారు. రాహుల్‌గాంధీ గతంలో వరంగల్ వచ్చి రైతు డిక్లరేషన్ పేరుతో సభ పెట్టారంటూ నాటి రాహుల్ó, రేవంత్‌రెడ్డి స్పీచ్‌ను సభలో ప్రదర్శించామని, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో 34 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇక్కడ రైతు సదస్సు పెడితే అక్కడ మెగా రైతు మేళా పెట్టారని ఎద్దేవా చేశారు. అన్నదాతలకు రైతు బీమా ఇవ్వని దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
—————————————————————————————————————————————————————
కాంగ్రెస్ పాలనలో వేయిమంది రైతులు మృతి 
వారందరికీ రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలికావద్దు.. గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని రైతులకు బీఆర్ఎస్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రెండేళ్లలో రాబందు రాజ్యం పోయి రైతుబంధు కేసీఆర్ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన నాలుగు తీర్మానాలు చేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో వెయ్యి మందికిపైగా రైతులు చనిపోయారని, రోడ్డున పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సు తీర్మానాలను ప్రభుత్వానికి పంపిస్తున్నామన్నారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి రుణ మాఫీ చేస్తానన్నాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం.. ఒక్క ఊరిలోనైనా రుణ మాఫీ జరిగిందంటే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ దందాలు, కమీషన్లు, కొట్లాటలే అని విమర్శించారు. రేవంత్ రెడ్డి 69సార్లు దిల్లీకి వెళ్లాడని, కానీ 69 పైసలు కూడా తేలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో రాహుల్ బంధు నడుస్తున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజల గురించి పట్టించుకునే వాళ్లే లేరన్నారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవు.. కానీ రాహుల్ గాంధీకి మాత్రం మూటలు పంపిస్తున్నాడని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులను నంబర్ వన్ స్థానంలో నిలిపారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ కంటే రైతును బాగా చూసుకున్న నాయకుడు దేశంలోనే లేడని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో సాగు పెరిగి వరంగల్‌లో భూముల రేట్లు పెరిగాయన్నారు. కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు పడిపోయాయన్నారు. ధాన్యం కొనుగోలు కోసం వానల్లో, ఎండల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట కొనుగోలు కేంద్రంలో గోడ కూలి నలుగురు రైతులు చనిపోయారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకటి రోజులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





