– 10న రైతు ఆశీర్వాద సభ
– రద్దయిన చోటనే తిరిగి నిర్వహణ
– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 7: గత నెలలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను తిరిగి ఈ నెల 10న నిర్వహించాలని ప్రబుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. 10వ తేదీన ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ప్రతిష్టాత్మక ’రైతు ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ భారీ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభాస్థలాన్ని స్వయంగా పరిశీలించారు.. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను రికార్డ్ స్థాయిలో అందజేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఏడు రోజుల్లోనే ఏకంగా 7,491 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఎల్‌నినోపై అగ్రివర్సిటీ చేసిన సూచనలు రైతులకు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ’తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం’తో రైతులకు వాట్సప్ ద్వారా కచ్చితమైన, సమయానుకూలమైన వాతావరణ సమాచారాన్ని అమలు చేస్తున్నాం. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను వెంటనే అమలు చేయాలని తుమ్మల సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





