రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం..
చేసిన అప్పులను గత ప్రభుత్వం దాచి పెట్టింది..
ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతున్నాం..
మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై ఆయన కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారెంటీ అమలు అయి తీరుతుంది.. ఎవరు ఎన్ని అబద్దాలు చెప్పినా రైతులు నమ్మొద్దు.. సోనియా గ్యారంటీగా తాను చెపుతున్న సంక్రాంతి తర్వాత రైతు భరోసా చేస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉప సంఘం వేశామని, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలపై చర్చించి ఖరారు చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామన్నారు. మారువేషంలో వొచ్చే మారిషులు బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని ఈసందర్భంగా సీఎం రేవంత్ కోరారు.
పాలమూరు లో జరిగిన రైతు పండుగలో వేలాది మంది రైతులు పాల్గొని తమకు ఆశ్వీరాదం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల ఆశ్వీరాదం ప్రభుత్వానికి గొప్ప శక్తి నిచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్నారు. వాస్తవాల ప్రాతిపదికన మా ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ను రూపొందించుకుంటోంది.. 16 వేల మిగులు బడ్జెట్‌తో రూ.69 వేల కోట్ల అప్పులతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.. కేసీఆర్ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పుతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఏడు లక్షల కోట్ల అప్పుపై ప్రతీ నెల రూ. 6500 కోట్ల వడ్డీ చెల్లించే పరిస్థితి ఉంది. ఏడు లక్షల కోట్ల అప్పు ఉందన్న విషయాన్ని ఏ సందర్భంలో కూడా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ప్రజలకు చెప్పలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నామని, బంగారు తెలంగాణగా మారుస్తున్నామని అబద్దాలు చెప్పారు… తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9 న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చే సి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికి అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర , ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. 2023 వానాకాలం రైతు బంధు కేసీఆర్ ఎగ్గొట్టారు. మేం అధికారంలో రాగానే రూ.7625 కోట్లను రైతు బంధు కింద చెల్లించామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు 17869 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మహబూబ్ నగర్ లో రూ.2747 కోట్ల రుణమాఫీని నాలుగో విడతగా చేశాం. మొత్తంగా 25,35,964 మంది రైతులకు రూ.20,616 కోట్ల మేరరుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. స్వాతంత్రం వొచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో 20616 కోట్ల రుణమాఫీ చేయలేదు.. దేశంలో ఇది గొప్ప రికార్డు.. బీఆర్‌ఎస్ హయాంలో రెండు సార్లు కూడా రూ.లక్ష రుణమాఫీ సరిగా చేయలేదు.. ఏక మొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు.. ఎన్నికల సమయంలో అవుటర్ రింగ్ రోడ్డును అమ్మి 11 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు.. నాలుగున్నర యేళ్లు రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ కింద రైతులు 8578.97 వేల కోట్ల చెల్లించాల్సి వచ్చింది.. బీఆర్‌ఎస్ రెండో సారి చేసిన రుణమాఫీ కేవలం 3331 కోట్ల మాత్రమే … బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎలాంటిదో రైతులకు తెలుసు.. కాంగ్రెస్ రుణమాఫీ తో రైతులు ఆనందంగా ఉన్నారు.. కేసీఆర్ పెట్టిన రైతు బంధు బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని, మేం రైతు పక్షపాతి అని మేం నిరూపించుకున్నామని సీఎం రేవంత్ అన్‌ఆనరు.
సన్న వడ్లకు బోనస్ పై అపోహలు..
సన్న వడ్ల కు రూ.500 బోనస్ పై కొందరు అపోహలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేవారు. వరి కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామని, వరి వేసుకుంటే ఉరేనని కేసీఆర్ గతంలో అన్నారని ఆరోపించారు. మా ప్రభుత్వం మాత్రం సన్న వొడ్లు పండించండి బోనస్ ఇస్తామని చెపుతోంది.. ఇప్పటి వరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది.. వొచ్చే సీజన్ కూడా రూ.500 బోనస్ కొనసాగుతుంది. తెలంగాణ సోనా, బీపీటీ ,హెచ్‌ఎంటీ లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ దిగుబడి వొస్తుంది.. తెలంగాణ ప్రజలు ఎక్కువగా తినే బియ్యం కూడా ఇవే.. తెలంగాణ భూముల్లో పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు.
రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు..
సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతామని, రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలని కోరారు. 2 లక్షల వరకు వంద శాంత రుణమాఫీ పూర్తైంది.. రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయిందన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదు. దీరకాలిక రుణాలను కూడా బ్యాంక్ లు పంపించాయి.. అందుకే 31 వేల కోట్లకు పెరిగింది.. తప్పుడు సమాచారం ఇస్తే శిక్షలు తప్పవని చెప్పడంతో బ్యాంకులు వివరాలు సరిచేసి ఇచ్చాయి.. గుజరాత్‌లో మద్య నిషేధం ఉందని బీజేపీ చెబుతోంది.. కావాలంటే అక్కడ ఏ బ్రాండ్ లు దొరుకుతాయే తీసుకెళ్లి చూపిస్తా.. కిషన్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం. మాట్లాడటానికి ఆయనకు ఏం అర్హత ఉంది కేంద్రంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు, మేం ఇచ్చిన హామీలపై చర్చించడానికి మేం సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.