ప్రపంచ వాతావరణ సదస్సు కాప్-29 అజర్ బైజాన్‌లోని బాకులో జరిగింది. నవంబర్ 11-22 మధ్య జరగాల్సిన ఈ సదస్సును అంతర్గత విభేదాలు, వాగ్వివాదాల వల్ల రెండు రోజులు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలన్న లక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది, ఇంకేమాత్రమూ శీతల దేశాల శాస్త్రీయ చర్చలకో, ఎవరో కొందరు క్లైమెట్ శాస్త్రవేత్తల హెచ్చరికలకో పరిమితమైనది కాదు. ఆ ఫలితాలను ఇప్పుడు స్వయానా అనుభవిస్తున్నాం. ఉత్తర భారతం లోనే కాదు, యూరోప్‌లో కూడా ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నాయి. భూ ష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గించాలనే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలను, 20 ఏళ్లకు లెక్కించి చెప్పాలనే సాంకేతిక కారణం పక్కన పెడితే, ఇప్పటికే 1.5 డిగ్రీల మార్కును దాటేశాము. వాతావరణ మార్పుల తీవ్రత వల్ల చాలా ప్రాంతాలు నివాసయోగం కాకుండా పోతున్నాయి.
వాతావరణ విపరీతాల వల్ల దిగువ ప్రాంతాలే కాక, అన్ని ప్రాంతాలకూ తీవ్రమైన నష్టం జరుగుతోంది. చరిత్రలో ఒక లక్షా 25 వేల సంవత్సరాలకు ముందు మనుషులు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆఫ్రికాను వదిలి యురేషియాకు పోతున్న సందర్భం అది. ఇప్పుడు మళ్లీ ఈ వాతావరణ ఆస్థిరతలు ఎక్కడికి దారితీస్తాయో, అర్థం కాని పరిస్థితి ఉంది. ధనిక దేశాలు బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను దీర్ఘకాలంగా వాడుతున్నాయి. ఇది భూగోళం వేడెక్కడానికి కారణమవుతోంది. దీనివల్ల సముద్రాలు పొంగి ద్వీపదేశాలు ముంపునకు గురవుతున్నాయి. అవి క్రమంగా అదృశ్యమయ్యే ప్రమాదముంది. వాతావరణ మార్పులు తెచ్చిపెడుతున్న వరదలు, తుపానులు, అనావృష్టి వంటివి పేద దేశాలను ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. ఈ నష్టాలకు పరిహార నిధిని ఏర్పాటు చేస్తారనీ, దాని పరిమాణాన్ని కాప్-29లో నిర్ణయిస్తారని ఆశించారు. భూతాపానికి దారితీస్తున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త మార్గాలను గుర్తిస్తారనీ భావించారు.
భూ ఉష్ణోగ్రత పెరుగుదల 2030కల్లా 1.5డిగ్రీల సెల్సియస్ ను చేరుకుని, ఆపైన మించిపోవొచ్చని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్‌ఈపీ తాజా నివేదిక హెచ్చరించింది, దీన్ని నివారించడానికి కాప్-29 దిశానిర్దేశర చేస్తుందని అందరూ విశ్వసించారు. వాతావరణ మార్పుల నిరోధానికి గతంలో క్యోటో, పారిస్, గ్లాస్గో, దుబాయ్ సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు కాప్-29 గట్టి చర్యలు తీసుకొంటుందనీ భావించారు. భూతాపానికి బాధ్యుల్కెన సంపన్న దేశాలు మరింత ఎక్కువ బాధ్యత తీసుకుని శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే డిమాండ్ ఉంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న తమకు భారీగా ఆర్థిక సాయం చేయాలనీ పేద దేశాలు కోరుతున్నాయి. ఇందుకోసం కాప్-29 సదస్సులో ఎక్కువ నిధులిస్తూ నూతన సమష్టి పరిమాణాత్మక లక్ష్యాల నిర్దేశం జరుగుతుందని ఆశించారు. తీరా కేటాయింపులను చూసి వర్ధమాన దేశాలు పెదవి విరిచాయి. తీవ్ర నిరసననూ తెలిపాయి. సంపన్న దేశాలు తమ కష్టనష్టాలను పట్టించుకోకుండా తోచినంత విదిలిస్తున్నాయని అవి మండిపడుతున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏటా 1.3లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అవసరమని పేద దేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, కాప్-29లో ధనిక దేశాలు 30 వేల కోట్ల డాలర్లతో సరిపెట్టాయి. అది కూడా 2035 నుంచి అందిస్తామని మెలిక పెట్టాయి.
ఇది అరకొర మొత్తమేనని భారత్ సైతం గట్టిగా నిరసించింది. న్కెజీరియా, క్యూబా, బొలీవియా, చిన్న ద్వీప రాజ్యాల సంఘం, ఆఫ్రికా గ్రూపు, అల్పాదాయ దేశాల సంఘం కూడా నిరసన గళం విప్పాయి. సంపన్న రాజ్యమైన కెనడా కూడా పేద దేశాలతో గొంతు కలపడం విశేషం. వాతావరణ సమస్య ఇకముందూ రగులుతూనే ఉండే అవకాశం కనిపిస్తోంది. సంపన్న దేశాలు 2020 నుంచి వాతావరణ కింద ఏటా 10 వేల కోట్ల డాలర్లు ఇస్తామని వాగ్దానం చేశాయి. 2022లో సదరు లక్ష్యాన్ని అందుకున్న ఆ దేశాలు 2025 వరకు దీన్ని కొనసాగిస్తామన్నాయి. ఇప్పుడు తమ సాయాన్ని 30వేల కోట్ల డాలర్లకు పెంచుతున్నామనీ, అదీ ఉదారంగా ఇస్తున్నదేనని వాదిస్తున్నాయి. వాస్తవానికి 2030కల్లా 50వేల కోట్ల డాలర్ల సాయం అందిస్తామని అవి మొదట్లో ప్రతిపాదించాయి. అది చివరికి 30వేల కోట్ల డాలర్లకు తగ్గింది. వొచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే కాప్-30 సభలో వార్షిక వాతావరణ ఫైనాన్స్‌ను 1.3లక్షల కోట్ల డాలర్లకు పెంచే విషయం పరిశీలిస్తామన్న మాటతో సరిపెట్టేశారు. వాతావరణ వైపరీత్యాలతో 2049 నాటికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఏటా 19 నుంచి 59 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో కేవలం రెండు తుపాన్లతో అమెరికాకు 10వేల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది.
2023లో చ్కెనా ప్రకృతి ఉత్పాతాలతో 4200 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. పేద దేశాల సంగతి చెప్పనవసరమే లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పేద దేశాలకు ఆర్థిక సాయం కోసం 72 కోట్ల డాలర్లతో నష్టనివారణ నిధిని ఏర్పాటు చేయాలని కాప్-29 నిశ్చయించింది. ఇది ఏ మూలకూ సరిపోదు. అమెరికా 1.75 కోట్ల డాలర్లను నిధికి అందిస్తానని వాగ్దానం చేసింది. అయితే, వాతావరణ మార్పులు బూటకమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తుంది. దీంతో ఆ కొద్ది సాయమైనా అందేది అనుమానమే. ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030కల్లా మూడు రెట్లు పెంచాలనేది కాప్-29 లక్ష్యం. కానీ, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేక తీర్మానం చేయకపోవడం గమనార్హం. దీనివల్ల సంపన్న దేశాలు బొగ్గు, చమురును యథేచ్ఛగా వినియోగిస్తాయనే ఆందోళన వ్యక్తమైంది. వాతావరణ మార్పుల నిరోధానికి సంపన్న, వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నడవడం తప్పనిసరి.
ఈ విషయంలో ఏకాభిప్రాయం లోపించడం కాప్-29లో స్పష్టంగా కనిపించింది. ఇక, ఇప్పుడు భూగోళం ఒక ప్రమాదపు అంచున ఉంది. ఇక వెనక్కు తీసుకోలేనంతగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఇది ఇక ఒక్క ధనిక దేశాల సమస్య మాత్రమే కాదు. అయితే వారి దృష్టి అంతా ఇప్పుడు ఉక్రెయిన్‌లో రష్యాను ఏ విధంగా సైనికంగా ఓడిరచాలి, చ్కెనాను ఆర్థికంగా ఎట్లా చుట్టుముట్టాలి అనేదే. పాలస్తీనాలో మానవ హననం జరిగినా సరే. చమురు సమృద్ధిగా వున్న పశ్చిమాసియాను లొంగదీసుకోవడానికి ఇజ్రాయిల్‌ను ప్రయోగించడం, మిగిలిన ప్రపంచంపై ఆధిపత్యం చలాయించడం ఎలా? అన్నదే వారి ఆసక్తి. ఇదే వారి సూత్ర బద్ధత (రూల్ బేస్డ్ ఆర్డర్). జి7 దేశాలు, ప్రకృతి నియమాలకే కాదు. ఇతర దేశాలకు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. తమ పెత్తనాన్ని నిలుపు కోవడానికి గుప్పెడన్ని ధనిక దేశాలు అందరి భవిష్యత్తును ఫణంగా పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మెరుగైన ప్రపంచాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనేది ముందున్న పెద్ద సవాలు.
-ఎం.జి.ఆర్