– కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపు
– దేశ చరిత్రలోనే తొలిసారి
– ఒకటో తేదీనే జీతాలు
– త్వరలోనే ‘క్యాష్‌లెస్’ హెల్త్ కార్డ్స్
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో భద్రత, భరోసా కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఉద్యోగుల సంక్షేమం కోసం దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సరికొత్త ఉచిత బీమా పథకాన్ని ఆమోదించిందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా అటు ప్రభుత్వంపై కానీ, ఇటు ఉద్యోగులపై కానీ ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా బ్యాంకులతో మాట్లాడి ఈ భారీ బీమా రక్షణను కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం (ఎంవోయూ) దుర్చుకున్నది. ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో గురువారంజరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ. కోటి 25 లక్షలు, అదే విమాన ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుందని భట్టి వివరించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ. 10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందన్నారు. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాక నెలనెలా ప్రభుత్వ రికార్డుల ద్వారా జీతం పొందే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. తమ కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రాత్రికి రాత్రే రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదు. ఉద్యోగులు కేవలం జీతగాళ్లు కాదు, వారి కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఒక పెద్ద దిక్కుగా ఉంటుందని నమ్మకం కలిగించడమే మా లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు 15 లేదా 20వ తేదీ వరకు రాకపోవడం వల్ల ఉద్యోగులు పడిన ఇబ్బందులను భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో ఇళ్లు, వాహనాలు, పిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఇన్‌స్టాల్మెంట్స్ (ఈఎంఐలు) కడుతున్నారు. సకాలంలో జీతాలు రాకపోతే వారి అకౌంట్లు బ్యాడ్ అకౌంట్స్‌గా మారి సిబిల్ స్కోర్ దెబ్బతినేది. మా ప్రభుత్వం రాగానే ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి గారు ‘ఉద్యోగుల హక్కులను కాపాడాలి’ అని గట్టిగా నిర్ణయించుకుని, ఒకటో తేదీ నాడే జీతాలు ఇచ్చేలా కఠినమైన ప్రణాళికను అమలు చేశారని అన్నారు. ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న హెల్త్ కార్డ్‌ల సమస్యకు ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక ప్రత్యేక ‘ట్రస్ట్’ ద్వారా ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో ‘క్యాష్‌లెస్’ (నగదు రహిత) వైద్య సేవలు అందించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందని భరోసా ఇచ్చారు.
లబ్ధిదారులకు చేరవేసే వారధులు ఉద్యోగులే
రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల ఉచిత వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్ కార్డులపై సన్నబియ్యం, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా రూ. 1,11,116 ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ సంక్షేమ ఫలాలను చిట్టచివరి లబ్ధిదారునికి చేర్చడంలో డెలివరీ మెకానిజంగా ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే వారి కుటుంబ సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుందని కొనియాడారు.ఈ బీమా పథకం నమోదుకు ముందుకు వచ్చిన బ్యాంకర్లకు భట్టి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదూర విజన్‌కు అనుగుణంగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు, బ్యాంకర్లు, ప్రభుత్వం చేయిచేయి కలిపి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





