“రెండు తెలుగు రాష్ట్రాలు సోదర రాష్ట్రాలుగా మెలగ వలసి వుండగా తీవ్ర మైన పొర పచ్చాలు ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నియమించిన గోదావరి కృష్ణ యాజమాన్య బోర్డులు కేవలం మేక చన్నులుగా తయారైనవి. అవి క్రియాశీలంగా పని చేసే విధంగా జల శక్తి శాఖ చర్యలు చేపట్టడం లేదు. వర్షాకాలం ప్రారంభం కాగానే పూర్తి స్థాయిలో బోర్డుల సమావేశం నిర్వహించ వలసి వుండగా ఇప్పటి వరకు ఆ దిశగా ఎట్టి చర్యలు లేవు..”

విశ్రాంత పాత్రికేయుడు
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ సంబంధాలున్నా అవి వ్యక్తి గతానికే పరిమితమౌతోంది. గాని ఒక్క అడుగు ముందుకు వేసి రెండు రాష్ట్రాల మధ్య గల సమస్యల పరిష్కానికి ఉపయోగ పడటం లేదు. అయితే తెలంగాణలో ప్రధాన ప్రతి పక్షం బిఆర్ఎస్ పార్టీ పెద్ద ప్రతి బంధకంగా వ్యవహరించడం రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు విరుద్ధంగా వుండటం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. గోదావరి కృష్ణ జలాలను ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోచి పెడుతున్నాడని బిఆర్ఎస్ పార్టీ యాగీ చేస్తోంది. తమాషా ఏమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకొంటూ పోతున్నాడు.
రెండు రాష్ట్రాల మధ్య గల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షుడుగా నియమింప బడిన నిపుణుల కమిటీ సెప్టెంబర్ 7 తేదీ సమావేశం జరుగుతుందనే సమాచారం పొక్కగానే బిఆర్ఎస్ పార్టీ నేతలు “ఇంకేముంది? పోలవరం బనకచర్ల అనుసంధానానికి అనుమతి ఇచ్చేందుకేనని” పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. కాని కమిటీ సమావేశం ప్రకటించిన అధికారి గత సమావేశం ఎజెండానే వుంటుందని ప్రకటించారు. తీరా ఆంధ్ర ప్రదేశ్ తన ఎజెండాను బయట పెట్టగానే బిఆర్ఎస్ నేతలు సైలెంట్ కావలసి వచ్చింది. . బనకచర్ల అనుసంధానం ఆంధ్ర ప్రదేశ్ ఎజెండాలోనే లేదు.
మరో వేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇర్రిగేషన్ , అంతర్ రాష్ట్ర జల వివాదాలతో పాటు ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుల్లో వున్న కేసులు విషయమై ఇటీవల సమగ్ర సమీక్ష చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఎట్టి రాజీ పడకూడదని అన్ని వేదికల మీద సమర్థమైన వాదనలు వినిపించాలని దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఇర్రిగేషన్ మంత్రి ఉత్తమ్ తో పాటు ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ల్లో తెలంగాణ తరపున వాదించే వైద్య నాథన్ అడ్వెకేట్ కూడా పాల్గొన్నారు. గమనార్హమైన అంశమేమంటే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కేసులు వివరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పరస్పరం ఇన్ని కేసులు పెట్టుకొని పక్క పక్కనే వుండే రాష్ట్రాలు భారత దేశంలోనే వుండక పోవచ్చు.మరో విశేష మేమంటే కింద భాగంలో నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ శ్రీ శైలం జలాశయం నుండి విద్యుదుత్పత్తి చేస్తూ కిందకు నీళ్లు వదలుతోందనేది ఆంధ్ర ప్రదేశ్ ఫిర్యాదు. ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో మరో ప్రతిపాదన వచ్చింది..
కృష్ణ నదిపై జలాశయాలు పూర్తిగా నిండక ముందే ఆంధ్ర ప్రదేశ్ మల్యాల ముచ్చు మర్రి కేంద్రాల నుండి నీళ్లు తోడేస్తూ తాము విద్యుదుత్పత్తి చేసేందుకు అంతరాయం కల్పిస్తున్నందున అందుకు పరిహారం కోరే అంశం ట్రిబ్యునల్ దృష్టికి తేవాలని అడ్వెకేట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మరో వేపు ప్రస్తుతం రాయలసీమలో పెద్ద ఆందోళన బయలు దేరింది. శ్రీ శైలం జలాశయం నుండి తెలంగాణ నీళ్లు కిందకు వదలుతుండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా వుందని రాయలసీమ వాసులు ఆరోపించుతున్నారు. సాగునీరు కాదు కదా ఈ ఏడు తాగు నీరు కూడా తమకు లభ్యం కాదేనని రాయలసీమ వాసులు గోల చేస్తున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ కూడా విద్యుదుత్పత్తి చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలు సోదర రాష్ట్రాలుగా మెలగ వలసి వుండగా తీవ్ర మైన పొర పచ్చాలు ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నియమించిన గోదావరి కృష్ణ యాజమాన్య బోర్డులు కేవలం మేక చన్నులుగా తయారైనవి. అవి క్రియాశీలంగా పని చేసే విధంగా జల శక్తి శాఖ చర్యలు చేపట్టడం లేదు. వర్షాకాలం ప్రారంభం కాగానే పూర్తి స్థాయిలో బోర్డుల సమావేశం నిర్వహించ వలసి వుండగా ఇప్పటి వరకు ఆ దిశగా ఎట్టి చర్యలు లేవు. మొన్న కృష్ణ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించినా ఎట్టి నిర్ణయం లేకనే వాయిదా పడింది.





