చట్టం ముందు అందరూ సమానమే

– నేరాన్ని చూసీ చూడనట్లు వదిలేయను
– లక్ష్యం, స్పష్టత ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ
– దీర్ఘకాలిక దృష్టితో అభివృద్ధి చేయాలి
– నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది
– రియల్ ఎస్టేట్ బాగున్నా ..
– మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదు
– విజన్ డాక్యుమెంట్  భవిష్యత్తు ప్రణాళిక
– వే టు న్యూస్ కాంక్లేవ్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : లక్ష్యం, తీసుకుంటున్న నిర్ణయాల్లో స్పష్టత ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వే టు న్యూస్ కాన్‌క్లేవ్-2026లో ఆయన శుక్రవారం మాట్లాడారు. సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుంది.. కానినీ దాన్ని అధిగమించడానికి ఆలోచించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధిగా నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది.. నా ఆలోచనపైన కొందరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.. అందరినీ మెప్పించలేం అన్నారు. వంద శాతం ప్రజలను మెప్పించాలని కోరుకుంటే మనకు అసంతృప్తి కలుగుతుంది.. 60 నుంచి 75 శాతం మంది మన ఆలోచనలను ఆమోదిస్తే అది అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు అన్నారు. నేను జూబ్లీహిల్స్ నుంచి గ్రామాలకు వెళ్లాను.. 30 యేళ్ల క్రితమే సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో చూశాను.. గ్రామంలో పేద రైతులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదవే విద్యార్థులు ఎలా ఉంటారో నాకు తెలుసునన్నారు. రాష్ట్రంలో ప్రజలు, పార్టీలు శాశ్వతం.. ప్రభుత్వాలు మారుతుంటాయి.. ప్రభుత్వాలు ఏర్పాటు చేశాక తాత్కాలిక సంక్షేమం, అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తుంటాయి.. దీర్ఘకాలిక విజన్ అవసరం అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ కారిడార్ హైదరాబాద్‌కు ఇస్తే తర్వాత ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఇలాంటివి చాలా ఉదాహరణలున్నాయన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో జీరో డ్రాపౌట్స్ ఉన్నాయి.
నేడు ఆర్టీసీ లాభాల్లో ఉంది
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల విద్యార్థినులకు ఖర్చు లేకుండా చేశామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా 28 నెలల్లో అందుకు సంబంధించి రూ.10 వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించామన్నారు. మహిళకు సగటున రూ.10 వేలు ఆదా అయ్యేలా చేశామని, ఆ డబ్బుతో మహిళలు అనేక రకాలుగా లబ్దిపొందుతున్నారని చెప్పారు. ఆర్టీసీ దివాలా తీసి ప్రైవేటుపరం చేస్తారనే అభిప్రాయం గత ప్రభుత్వంలో ఉండేది.. కానీ ఈ రోజు తాము ఆర్టీసీని లాభాల బాట పట్టించామని, ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350 కోట్లను ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్నామని, ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు 98 శాతం ఆకిపెన్సీ ఉందని సీఎం వివరించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న డీజీల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. 3000 ఈవీ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా డీజీల్ రూపంలో ఆర్టీసీ ఖర్చు చేస్తున్న రూ.2000 కోట్లు ఆదా అవుతుందన్నారు.
రాష్ట్రానికి ఒక ప్రణాళిక.. భవిష్యత్తు పై స్పష్టత ఉండాలి
దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రానికీ పూర్తిస్థాయి ప్రణాళిక లేదన్నారు. ముఖ్యమంత్రి అయ్యే వరకు 17 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే ఉన్నాను. ప్రజా సమస్యలపైన అవగహన ఉంది.. ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ దిగ్జజాలను తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములను చేశాం. పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకున్నాం. ప్రపంచంలోని అన్ని పెద్ద సంస్థలను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. ‘క్యూర్’ పరిధిలో 2053 చదరపు కి.మీ పరిధిలో 1.34 కోట్ల మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను తరలిస్తున్నాం అని చెప్పారు.
ఆక్రమణలను ప్రకృతి క్షమించదు
చెరువులు, కుంటలు, నాలాలు, పబ్లిక్ పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు.. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకుంటే ప్రకృతి క్షమించదు. ఆక్రమణదారులకు ముందే నోటీసులు ఇస్తున్నాం.. తుమ్మిడికుంటను ఆక్రమించుకుని పంక్షన్ హాల్ కట్టుకుంటే నీళ్లు ఎక్కడికి పోతాయి అని ప్రశ్నించారు. ఏదీ నా కోసం, నా ఇంటికి కోసం చేయడం లేదు.. ప్రజల కోసం చేస్తున్నా.. ఈ క్రమంలో కొన్ని తిట్లు భరిస్తా అని సీఎం అన్నారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నది ఏ పార్టీ నాయకుడు అంటూ ఆ నాయకుడు హెలికాఫ్టర్ పెట్టి పార్టీ నాయకులపైన పూలు చల్లించాడని వ్యాఖ్యానించారు. చెరువులు ఆక్రమించుకున్న వారికి డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నాం.. మూసీలో అక్రమంగా ఉంటున్న వారిని ప్రభుత్వం ఉదారంగా ఆదుకుంటుంది.. డబల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తాం.. విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చామన్నారు. వారిని పరోక్షంగా కొందరు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మూసీ మురికిలో ఉండాలని ఎవరూ కోరుకోరని, మూసీ నది పేరును ఎవరూ తమ బిడ్డలకు పెట్టుకోలేదు.. మూసీ అంటే మురికికూపం గుర్తుకు రావడం వల్లనే  అలా జరిగింది అని అన్నారు. నేరాన్ని చూసీచూడనట్లు వదిలేయను.. నాకు మంచీ చెడు తెలుసు. విక్షణ తెలుసు అన్నారు. నా ప్యూచర్‌ను ప్రజలు నిర్ణయించారు.. ప్రతిపక్షం వాళ్లు కాదు అని అన్నారు.
‘ప్యూర్’ పరిధిలో పరిశ్రమల ఏర్పాటు
10 వేల కి.మీ ‘ప్యూర్’ పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.. ఐటీ సంస్థలు, జీసీసీలు, పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ‘రేర్’లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.. 30 వేల ఎకరాల్లో భారత్ ప్యూచర్ సీటీని ఏర్పాటు చేస్తున్నాం.. ఇప్పటివరకు కాలనీలు, జోన్లు మాత్రమే ఏర్పాటు చేశారు.. కానీ మేం మొదటిసారి ప్యూచర్ సీటీ నిర్మిస్తున్నాం.. మౌలిక సదుపాయాలు కల్పిస్తే సీటీ నిర్మాణం సాధ్యమే.. 10 లక్షల మంది వెయ్యి ఎకరాల్లో పనిచేస్తున్నారు.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం ఏడు బుల్లెట్ ట్రైన్లు ఇస్తే అందులో మూడు తెలంగాణకు తెచ్చాం.. శంషాబాద్ కేంద్రంగా బుల్లెట్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం.. రోడ్డు, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నాం.
రియల్ ఎస్టేట్ బాగున్నా..
రియల్ ఎస్టేట్ బాగుంది.. కానీ నేను ఆశించినట్లు లేదు అని సీఎం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల కారణంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గింది. 2021 నుంచి ఏడేళ్లు తీసుకుంటే గతం కంటే ఆదాయం పెరిగింది. ఎక్కడా తగ్గలేదు. కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుబడి పెట్టి వాళ్లే రాసి వాళ్లే చూసి వాళ్లే సంతోషిస్తున్నారు. వాళ్లు భ్రమల్లో ఉన్నారు.. నేను వాస్తవంలో ఉంటా.
డ్రగ్స్ నియంత్రిస్తుంటే విమర్శలా?
డ్రగ్స్‌ను కంట్రోల్ చేయడానికి ఈగల్ ఫోర్స్‌ను తీసుకువచ్చాం.. ఫామ్ హౌస్‌లో పార్టీలు చేసుకుని దొరికిపోయి నన్ను విమర్శిస్తున్నారు. దీపావళి రోజున చిచ్చుబుడ్లు కాల్చాలి కానీ మందుబుడ్లు పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. గంజాయిని నియంత్రిస్తుంటే కూడా విమర్శిస్తున్నారు.. విలన్‌గా చూస్తున్నారు అని అన్నారు. నా కోసం ఏదీ చేయను.. నా జీవితంలో నేను చాలా సౌకర్యంగా ఉన్నా.. 100 శాతం సంతృప్తితో ఉన్న.. భవిష్యత్తు తరాల కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆలోచన.
నెహ్రూ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు బాగున్నాయి
మేడిగడ్డ నిర్మిస్తే మేడిపండులా కుప్పకూలిపోయింది.. సగం జ్ఞానంతో చేస్తే ఇలాగే అవుతుంది.. తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు.. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు.. ఆ ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయం, సంక్షేమం లాంటి సంస్కరణను ఇందిరాగాంధీ తీసుకున్నారు.. మూడో స్టేజ్ సంస్కరణలు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ తీసుకువచ్చారు.. రవాణా సౌకర్యం సరిగా లేనప్పుడు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేశారు.. 27వేల ప్రభుత్వ స్కూల్స్‌లో 19 లక్షల మంది విద్యార్థులున్నారు. 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉన్నారు. 12వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 38 లక్షల మంది విద్యార్థులున్నారు.. కులాలు, మతాల వారీగా గతంలో స్కూల్స్ నిర్మించారు.. ఇది కుల వ్యవస్థను ప్రోత్సహించినట్లే కదా. నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్‌లో అన్ని కులాలు, మతాల విద్యార్థులంటారు.. రూ.20 వేల కోట్లతో వంద స్కూల్స్‌ను నిర్మిస్తున్నా. 2500 మంది విద్యార్థులు చదువుకోతున్నారు.. ప్రభుత్వ స్కూల్స్‌లో బ్రేక్‌ఫాస్ట్, మిడ్ డే మీల్, స్నాక్స్ ఇస్తాం.
విలువలు నెలబెడతా
మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, విలువలు పోతున్నాయి.. వీటిని నిలబెట్టాల్సిన బాధ్యత పాలకుడిగా నాకుంది.. బుర్ర లేని వాళ్లు టెండర్లు, కాంట్రాక్టులు మాత్రమే చూస్తారు.. టెండర్లు ఇచ్చి కమీషన్లు తీసుకునే వారి ఆలోచన వేరే ఉంటుంది.. నా దగ్గరకి వచ్చి నీకు ఇంత ఇస్తాం పనిచేయి అని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు.. రోజూ 18 గంటలు అధికారులతో సమీక్షలు చేస్తున్నా.. అంతకుముందు ఉన్న వారు మూడు నెలలకోసారి రివ్యూ చేసేవాళ్లు అని అన్నారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *