– ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరో ఏర్పాటు
– సవాల్‌గా మారిన సైబర్ నేరాలు
– సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం నా విధి
– వే2 న్యూస్ కాన్క్లేవ్లో డీజీపీ ఆనంద్ వెల్లడి
– సవాల్‌గా మారిన సైబర్ నేరాలు
– సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం నా విధి
– వే2 న్యూస్ కాన్క్లేవ్లో డీజీపీ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : రాష్ట్రంలో ఎఫెక్టివ్ పోలీసింగ్ చేస్తామని డీజీపీ సి.వి.ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం జరిగిన ‘వే టు న్యూస్ కాంక్లేవ్-2026’లో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీస్ సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తారని ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్‌లో భాగంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ఒక పోరాటం తరహాలో ముందుకు సాగుతోందని డీజీపీ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పోలీసు పద్ధతులను వీడి సరికొత్త సవాళ్లయిన నార్కోటిక్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై శాఖను సమూలంగా సన్నద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ విస్తరిస్తుండటం అత్యంత ఆందోళనకరమని, దీని అడ్డుకట్టకు ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయంలో ‘యాంటీ డ్రగ్ కమిటీలు’ (సేఫ్టీ క్లబ్‌లు) ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయనుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయులో చర్చలు జరిగాయని, త్వరలోనే సరికొత్త జీవో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపై అడ్మిషన్ల సమయంలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అండర్‌టేకింగ్ తీసుకోవాలని, విద్యాసంస్థల లోపల ఇలాంటి ఉదంతాలు జరిగితే యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరించారు. విద్యాసంస్థల చుట్టుపక్కల ఉండే పాన్ షాపులపై ఇప్పటికే నిరంతర నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహమ్మారిపై రాష్ట్రంలోని కమిషనర్లు, ఎస్పీలు అందరూ గట్టిగా పోరాడాలన్నారు.
సిబ్బంది ఆరోగ్యం కాపాడటం తన విధి
16 గంటలకు పైగా శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం తన బాధ్యతని డీజీపీ అన్నారు. గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సహకారంతో 20 వేల మంది సిబ్బందికి హెల్త్ ప్రొఫైలింగ్ చేయించి ‘ఫిట్ కాప’ ప్రోగ్రాం ప్రారంభించానని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న 75వేల మంది సిబ్బందికి (మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 93వేలు కాగా 20వేలు ఖాళీలు ఉన్నాయి) ఒక ప్రత్యేక యాప్, సాంకేతికత ద్వారా ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ రహస్యాన్ని పంచుకుంటూ అండర్-19 క్రికెటర్ రోజుల నుంచి నేటివరకు నిరంతరం బరువును 75-76 కేజీల మధ్యే కాపాడుకుంటున్నానని తెలిపారు. వారానికి మూడు రోజులు వెయిట్ ట్రైనింగ్, క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్ ఆడుతుంటానని, గత ఏడాది లీగ్ క్రికెట్లో 5 సెంచరీలు కూడా చేశానని చెప్పారు. తన ఆహారంలో ఫోర్ వైట్స్ (అన్నం, పంచదార, ఉప్పు, మైదా) ఎప్పుడో తొలగించానని చెప్పారు.
త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరో
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 7,500 మంది, దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండటం పట్ల డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ట్రాఫిక్ విధానాలను (స్టాండర్డైజ్డ్ ప్రాక్టీసెస్) అమలు చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఆర్అండ్బీ, రవాణా శాఖల ఇంజనీర్లు, నిపుణులు ఉంటారని, హాట్స్పాట్లను గుర్తించి మార్పులు చేస్తామని చెప్పారు. సీట్ బెల్ట్ ధరించడం కేవలం ముందు సీటు వారికే కాకుండా వెనుక సీటు వారికి కూడా తప్పనిసరి అని, ప్రమాదాల్లో ఎక్కువ శాతం వెనుక కూర్చున్న వారే చనిపోతున్నారని స్పష్టం చేశారు. జంక్షన్ల వద్ద యూ-టర్న్స్ ఏర్పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసిందేనని, ట్రాఫిక్ ఫ్లో పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని, అయితే ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు అనవసరమైనచోట్ల వీటిని పునఃసమీక్షిస్తామని తార్నాక జంక్షన్ ఉదాహరణను ప్రస్తావిస్తూ హామీ ఇచ్చారు.
పెను సవాల్‌గా సైబర్ నేరాలు
గతంలో మావోయిస్టుల సమస్య ప్రధానంగా ఉండేదని, పదేళ్లుగా ఆ సమస్య నుంచి ఉపశమనం లభించినా, ఇప్పుడు సైబర్ నేరాలు పెను సవాల్‌గా మారాయని డిజిపి విశ్లేషించారు. సాధారణ దొంగతనాల్లో రూ.20 నుండి రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగితే సైబర్ నేరాల్లో ఎలాంటి హింస లేకుండానే ఎక్కడో కూర్చుని నిమిషాల వ్యవధిలో ప్రజల జీవితకాల సంపాదనను కోట్లలో దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
18 మంది డీసీపీలలో తొమ్మిదిమంది మహిళలే
174 ఏళ్ల హైదరాబాద్ పోలీస్ చరిత్రలో గతంలో ఏ రోజూ ఒక్క మహిళా అధికారి కూడా లా అండ్ ఆర్డర్ ఎస్హెచఓగా పని చేయలేదని, తాను సీపీగా వచ్చిన తర్వాతే మధులత అనే ఇన్స్పెక్టర్ను లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు ఎస్హెచ్ఓగా నియమించానని గుర్తుచేశారు. తన హయాంలో 18 మంది డీసీపీలలో తొమ్మిదిమంది మహిళలేñ ఉన్నారని, వారు అత్యంత సున్నితమైన జోన్లను పురుషులకంటే అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఇటీవల వచ్చిన బ్యాచ్‌లోని 32 మంది మహిళా ఎసఐలు వ్యక్తిగత కారణాల వల్ల ఐటీ సెల్, సైబర్ క్రైమ్ పోస్టింగులు అడిగితే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఫీల్డ్ డ్యూటీలకు పంపానని, వారు ధైర్యంగా ముందుకు రావాలని ప్రోత్సహించినట్లు తెలిపారు. కాగా, పోలీసు శాఖలోకి వచ్చే యువతకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత, కడుపులోంచి వచ్చే తపన ఉంటేనే ఈ శాఖలోకి రావాలని పిలుపునిచ్చారు. అధికారం చలాయించడానికో, డబ్బు సంపాదించడానికో వస్తే మాత్రం ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్‌లో దొరికిపోవడం, సస్పెండ్ కావడం ఖాయమన్నారు. అలాంటి ఆలోచన ఉన్నవారు డిపార్ట్మెంటుకు వచ్చి ప్రభుత్వానికి, శాఖకు చెడ్డపేరు తేవద్దని హితవు పలికారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా పీహెచ్డీ, పీజీలు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని, ప్రత్యామ్నాయాలు ఉన్నా ఇక్కడికి వస్తున్నప్పుడు వృత్తి పట్ల నిబద్ధత అవసరమని డీజీపీ అన్నారు.
లండన్, యÖఎస్ విధానాలను రద్దుడం సరికాదు
రెండుమూడేళ్లుగా సిబ్బందిలో ఆత్మస్థైర్యం తగ్గినట్లు గమనించానని, లండన్, యూఎస్ విధానాలను ఇక్కడ రుద్దడం సరికాదని డీజీపీ అభిప్రాయపడ్డారు. సమాజం ఎప్పుడూ ‘స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ పోలీసింగ’ను కోరుకుంటుందని, 5 శాతం ఉన్న రౌడీషీటర్లు, క్రిమినల్స్, సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే మిగతా 95 శాతం ప్రజలకు ప్రశాంతత లభిస్తుందని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం విధులు నిర్వర్తించే ప్రతి కానిస్టేబుల్, హోమ్ గార్డుకు తాను సంపూర్ణ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గతంలో పెద్దపెద్ద వీఐపీలు ఫోన్లు చేసినా భయపడకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన సిబ్బందిని తాను కాపాడుకున్నానని, ఒక్కరిని కూడా సస్పెండ్ కానివ్వలేదని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్యులతో మర్యాదగా ప్రవర్తించడం ‘ఫ్రెండ్లీ పోలీసింగ’లో ఒక భాగమేనని, దానికి విడిగా నినాదాలు అవసరం లేదని తేల్చిచెప్పారు. తన 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఎన్నో జనరేషనల్ మార్పులను చూశానని, ప్రస్తుత ‘జెన్ జీ’, ‘ఆల్ఫా’ తరాల ఆలోచనా విధానం, సామాజిక విలువలు గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో నేటి యువ అధికారుల వద్ద అపారమైన సమాచారం ఉందన్న డీజీపీ ఆనంద్ సీనియర్ అధికారులు ఆ మార్పును సానుభూతితో అర్థం చేసుకుంటూ, వారిని సరైన మార్గంలో గైడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



