– సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: పిల్లలందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోతాయని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక వేడుకల మందిరంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎ.సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా డీటీఎఫ్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యా సదస్సు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులడ జి.ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో మారుతున్న తెలంగాణ విద్యా విధానం అనే అంశంపై లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు వస్తాయని ఆశించిన ప్రజలకు పాలకుల విధానాలు నేటికీ నిరాశే కలిగిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ కాలంలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు బాగా తగ్గిపోగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయింపులు పెంచడం లేదన్నారు. దీనిద్వారానే ప్రభుత్వ విద్యారంగం రోజు రోజుకూ కుచించుకుపోయి ప్రైవేటు విద్యారంగం పెరిగిపోతున్నదని అన్నారు. దీని ద్వారా పేదలకు విద్య అందకుండాపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అతిథిగా హాజరైన డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదని, విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, ముఖ్యమంత్రే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానం అమలు చేసే ఉద్దేశంతోనే తెలంగాణలో కూడా నూతన విద్యా విధానం రూపొందిస్తున్నారని, ఈ విధానాలన్నీ ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి దోహదపడేవి కావన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ మేధావులు, సంఘాలు, విద్యార్థులతో చర్చించి విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలన్నారు. 
సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన సంజీవరెడ్డి అభినందన సభ డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. డీటీఎఫ్ బాధ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, బంధువులు సంజీవరెడ్డితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సంజీవరెడ్డి అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయుడనీ, డీటీఎఫ్‌లో కూడా నిబద్ధతతో వివిధ హోదాలలో పనిచేశాడని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం.గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.రాజిరెడ్డి, చాప బాబు, ఎ.శ్రీనివాస రెడ్డి, బి.శ్యామ్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.లక్ష్మా రెడ్డి, కె.నారాయణ రెడ్డి, ఎం.రఘు శంకర్ రెడ్డి, అకాడమిక్ సెల్ కన్వీనర్ బి.రామకృష్ణ, రచయిత మెట్టు రవీందర్, అధ్యాపక జ్వాల సంపాదకులు పి.సుదర్శన్ రెడ్డి,డిటిఎఫ్ వరంగల్ ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎ.గోవిందరావు, ఆదిరెడ్డి,రేగ నరేందర్, అయిత తిరుపతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు ఎ.నరహరి, సీహెచ్.రామ్మోహన్, ఎ.సంతోష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు అంజనీదేవి, సుమ, సుభాషిణి, మల్లయ్య, డోరి రమేష్, డాక్టర్ కిషన్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




