రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలి

– ఎల్‌నినోతో వర్షాభావంపై అధికారులతో చర్చలు
– కార్యాచరణతో ముందుకు సాగాలని స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ఆదేశం

రంగారెడ్డి,ప్రజాతంత్ర,జూలై21: ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున రైతులను పండ్ల తోటలు, అరుతడి పంటల వైపు మళ్లించాలని శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ అధికారులకు సూచించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్‌ ‌సి. నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌శాసనమండలి చీఫ్‌ ‌విప్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ‌మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం తీవ్రత ప్రజలపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై దృష్టి పెట్టాలని అన్నారు. రైతులను తక్కువ నీరు అవసరమయ్యే పంటలు, పండ్ల తోటలు, అరుతడి పంటలు సాగు చేసేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఈ దిశగా వ్యవసాయ, ఉద్యాన అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ, పాడి పరిశ్రమలకు విద్యుత్‌ ‌సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ‌శాఖ అధికారులకు సూచించారు. ఎల్‌నినో బారిన ప్రజలు పడకుండా చూసే బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగంపైనే ఉందని స్పీకర్‌ ‌స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలని, అవసరమైన చోట నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.కార్యక్రమం చివరలో వర్షపు నీటి సంరక్షణ కు సంబందించిన తెలంగాణ జలసిరి పోస్టర్‌ ‌విడదల చేశారు. ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, ‌చేవెళ్ల ఎమ్మెల్యేలు మల్‌ ‌రెడ్డి రంగారెడ్డి, శంకర్‌, ‌కాలే యాదయ్య ఇంకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వివిధ విభగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *