– రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను తగ్గించడం అన్యాయం
– మెరిట్ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో కలపొద్దు
– ఉద్యోగ సంఘం నాయకుల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: దేశవ్యాప్త బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల (పీడబ్ల్యుడీ) పట్ల సాగుతున్న వ్యవస్థాగత వివక్షను రూపుమాపేందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (యూబీఐడీఈఎఫ్) తన పోరాటాన్ని ఉధృతం చేయడమే కాకుండా, పి. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి జాతీయ ప్రతినిధుల బృందం, శనివారం కేంద్ర దివ్యాంగుల సాధికారత శాఖ (డీఈపీడబ్ల్యుడీ), అదనపు కార్యదర్శి మన్‌మీత్ కౌర్ నందాను కలిసి, బ్యాంకింగ్ వ్యవస్థలో దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం, సమాన అవకాశాల కోసం అనేక చట్టాలను, పథకాలను అమలు చేస్తుంటే, బ్యాంకింగ్ సంస్థలు మాత్రం ‘ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (ఆర్‌పీడబ్ల్యుడీ) యాక్ట్, 2016’ను తుంగలో తొక్కుతూ, తమ ఉద్యోగుల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నాయని ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
వ్యవస్థాగత అన్యాయం బ్యాంకులు “కోటా ఆఫ్‌సెట్టింగ్” అనే అక్రమ పద్ధతిని అనుసరిస్తూ దివ్యాంగుల ప్రగతిని అడ్డుకుంటున్నాయని యూబీఐడీఈఎఫ్ నిరసన వ్యక్తం చేసింది. మెరిట్ ద్వారా సాధారణ కేటగిరీలో అర్హత సాధించిన దివ్యాంగ అభ్యర్థులను కూడా 4% రిజర్వేషన్ కోటాలోనే కలుపుతూ, రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను కృత్రిమంగా తగ్గిస్తున్నారని ఫెడరేషన్ ఆరోపించింది. ఇది చట్టవిరుద్ధమని, దీనివల్ల అర్హులైన ఎంతోమంది దివ్యాంగులు తమ పదోన్నతులను కోల్పోతున్నారని వారు పేర్కొన్నారు. యూబీఐడీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఇది కేవలం పరిపాలనా లోపం కాదు.. ఒక వ్యవస్థీకృత వివక్ష అన్నారు. మెరిట్ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో కలిపేసి కిందిస్థాయిలో ఉన్న దివ్యాంగులకు దక్కాల్సిన పదోన్నతులను దొడ్డిదారిన అడ్డుకుంటున్నారన్నారు. ఈ అక్రమ పద్ధతికి వెంటనే స్వస్తి పలకాలని, ఇటీవల జరిగిన అన్ని పదోన్నతుల ప్రక్రియలను వెంటనే పునఃసమీక్షించాలి అని డిమాండ్ చేశారు. మెరిట్ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో కలిపే పద్ధతిని వెంటనే నిలిపివేయాలి.. పదోన్నతుల ప్రక్రియలో రిజర్వేషన్ల అమలుపై జాతీయస్థాయి స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలి.. దివ్యాంగ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న హెచ్‌ఆర్ డిజిటల్ పోర్టల్స్ ట్రాన్స్‌ఫర్ పాలసీలను వెంటనే సవరించాలి.. బ్యాంక్ శాఖలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు దివ్యాంగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ఫిజికల్, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి అని డిమాండ్ చేసింది. సంబంధిత అధికారులు, బ్యాంకింగ్ పాలక మండళ్లు ఈ అన్యాయాలను వెంటనే సరిదిద్దకపోతే, చట్టపరమైన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. సమావేశంలో ఆర్.స్వామి నాయక్ (వర్కింగ్ ప్రెసిడెంట్), అమిత్ పాండే –(డిప్యూటీ జనరల్ సెక్రటరీ) పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




