– అందుకే ప్రమాద బీమా కోసం బ్యాంకర్లతో ఒప్పందం
– ఆదాయం పెంచండి.. మీ అవసరాలు తీరుస్తాం
– ఉద్యోగులకు బీమా పథకం ఒప్పంద కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : బతికి ఉన్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయిన తరువాత సానుభూతి మాత్రమే చూపుతాయి.. ఆర్థికంగా ఆదుకునేవారు చాలా తక్కువ.. ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రత యజమానిదే. రాష్ట్ర ప్రభుత్వమే మీకు యజమాని.. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అందించేందుకు ఇవాళ బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. రాష్ట్ర ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటగా సింగరేణి కార్మికులకు బీమా కల్పించేందుకు డిప్యూటీ సిఎం ప్రతిపాదించినప్పుడు నమ్మకం కలగలేదు.. ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.కోటి బీమా ఎలా సాధ్యం అనిపించింది.. కానీ ప్రమాదవశాత్తు మరణించిన 45మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి బీమా సొమ్మును అందించి ఇది సాధ్యమని నిరూపించారు.. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బీమాను అమలు చేయాలని నిర్ణయించాం అని వివరించారు. ‘కొందరు నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళన చేస్తుంటారు.. ఎవరు ఎలా మాట్లాడినా నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే.. ఈ గుంపే నా బలం.. ఈ గుంపే నా ప్రతిష్ఠ.. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులు.. మేం దొరలం.. మాకు గడీలు ఉన్నాయని కొందరిలా నేను గొప్పలు చెప్పుకోను.. నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే.. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధమే.. మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుదాం.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి దివాలా తీయించారని విమర్శించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారన్నారు. పదేళ్లు మొదటి తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేదా.. మీరు ఆలోచన చేయండి.. ఇపుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నాం.. చెప్పిన మాట ప్రకారం విడతలవారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నాం అని వివరించారు. మీకు సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి.. చర్చించుకుని పరిష్కరించుకుందాం అన్నారు. ప్రజలకు అందించే ప్రతీ సంక్షేమ పథకం అమలులో మీ కృషి ఉంది.. మీ నమ్మకమే మా బలం అని పేర్కొన్నారు. నిర్ణయాలు మేం తీసుకున్నా అది అమలు చేసేది మీరే.. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉంది అని సీఎం రేవంత్ అన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలని మేం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు.. మెట్రోను విస్తరిస్తామంటే వద్దే వద్దు అంటున్నారు.. నాడు మేం అభివృద్ధి చేయాలని పోరాడితే ఇప్పుడు వాళ్లు వద్దేవద్దు అని ధర్నాలు చేస్తున్నారు.. ఓట్లు వేయని ప్రజలు ఉంటే ఏంటి.. లేకుంటే ఏంటి అని ఊరిమీద పడి తిరుగుతున్నారు అంటూ కొంచెమైనా వారికి కృతజ్ఞత ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయినవారికి మేం పదవులు ఇస్తుంటే ఏవీ చేయొద్దని మాకు అడ్డు పడుతున్నారన్నారు. 30 నెలలుగా ఒక్క రోజు కూడా తాను సెలవు తీసుకోలేదు.. మేం రూపొందించిన ప్రణాళికలన్నీ ఇపుడు ఒక కొలిక్కి వస్తున్నాయి అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా నేను పదేపదే దిల్లీ వెళ్లేది.. మీ సమస్యలు తీర్చాలన్న ఆలోచనే తప్ప మాకు వేరే ఆలోచన లేదు అని అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో బాధ్యత పెరిగింది తప్ప నా నడక, నడతలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే.. రోజుకు ఒక గంట ఎక్కువ పనిచేయండి.. రాష్ట్ర ఆదాయం పెంచండి.. పెరిగిన ఆదాయాన్ని మీ అవసరాలకు వినియోగిస్తాం అని సీఎం రేవంత్ చెప్పారు. మార్పు తీసుకొద్దాం.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. దేశంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా ఎదగాలంటే మీ అందరి సహకారం అవసరమని అన్నారు. తెలంగాణ కలను సాకారం చేసుకున్న ఉద్యోగులకు తెలంగాణ ఆదాయం పెంచడం కష్టం కాదు.. ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని మాట ఇస్తున్నా అని రేవంత్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





