– పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు
– 28లోగా స్థలాల ఖరారు
– జూలై మొదటి వారంలో బ్రోచర్ విడుదల
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : పేదల సొంతింటి కలను నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే ‘క్యూర’ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదల ఉపాధి, పిల్లల చదువు, కుటుంబ జీవన వ్యవస్థ దెబ్బతినకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, భద్రాచలం దేవస్థానం అభివృద్ధి అంశాలపై అధికారులతో మంత్రి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘క్యూర్’ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రయోగాత్మకంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ‘క్యూర్’ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 20 వరకు స్థలాలను గుర్తించామని, మిగిలిన ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 28లోగా అన్ని స్థలాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి స్థలానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు, నిర్మాణ నమూనాలను కూడా 28లోగా సిద్ధం చేయాలన్నారు. ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్‌ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తామని వెల్లడించారు. అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఈ స్థలాల్లో అన్ డివైడెడ్ షేర్ కింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ భాగాన్ని మహిళల పేర రిజిస్ట్రేషన్ చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్‌లో ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే, ఈ కార్యాలయాల భవనాల మరమ్మతులకు సంబంధించి హౌసింగ్ ఏఈలు భవనాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి.గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





