– ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసి వారి వద్ద కొనుగోలు చేస్తున్న 16మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుల నుంచి రూ.16.40 లక్షల విలువైన 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈనెల 11న వట్టినాగులపల్లి కింగ్‌డమ్ పబ్ రోడ్డు వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న యశ్వంత్ సాయి షణ్ముఖ్ అనే పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారించగా డ్రగ్స్ మూలాలు బెంగళూరు, కేరళలో ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. వెంటనే తమ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈనెల 18న కేరళలోని త్రిస్సూర్‌లో మహమ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. విచారణలో ఓ నైజీరియన్ నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు అతడు తెలిపాడన్నారు. బెంగళూరులో నవీన అనే మహిళా పెడ్లర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితురాలిని విచారించగా కేరళలో ఉండే తన స్నేహితుడు అనేశ్వర్ ద్వారా డ్రగ్స్ సేకరించి ఇక్కడ విక్రయిస్తున్నట్లు అంగీకరించింది. పట్టుబడిన నిందితులందరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ నెట్‌వర్క్‌పై దర్యాప్తు మరింత ముమ్మరంగా కొనసాగుతోంది. మాదకద్రవ్యాల సరఫరాపై ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100, సైబరాబాద్ పోలీసుల వాట్సప్ నెంబర్ 8712663061కు ఫిర్యాదు చేయాలని డీసీపీ శ్రీనివాస్ సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




