– టిటిడి. ఇఒగా ఆయన అనుభవాల సారమే హరే శ్రీనివాస పుస్తకం
– పదవులకే వన్నె తెచ్చిన గొప్ప అధికారి
– పుస్తకావిష్కరణ సభలో హరీష్‌రావు ప్రశంసలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణా చారి (KV Ramana chary) పరిపాలనా సామర్థ్యం ఎందరికో ఆదర్శమని మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయకుడు హరీష్‌రావు ప్రశంసించారు. శుక్రవారం ఆయన రమణాచారి రచించిన ‘హరే శ్రీనివాస ‘పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా తన అనుభవాలతో ‘హరే శ్రీనివాస ‘పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. రమణా చారి గారు ఎన్నో ఉన్నత పెదవులు నిర్వహించినా టీటీడీ కార్య నిర్వహణా అధికారిగా నిర్వర్తించిన పాత్ర ఆయనకు పూర్తి సంతృప్తి ఇచ్చిందని హరే శ్రీనివాస పుస్తకం చదివితే మనకు అర్థమవుతుందన్నారు.
కడప జిల్లా కలెక్టర్ నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి సలహాదారు వరకు రమణా చారి ఏ పదవి నిర్వహించినా ఆ పదవి కి పూర్తి న్యాయం చేశారు. రమణా చారి పట్టుదల వ్యక్తిత్వం వల్ల ఆ పదవుల ఔన్నత్యం పెరిగిందన్నారు. బ్రాహ్మణుల్లో కూడా పేదవారు ఉన్నారు. వారికి కూడా మనం సంక్షేమాలు అందించాలని కెసిఆర్ కు చెప్పి బ్రాహ్మణ పరిషత్ ను ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు భక్తులు వెళ్లడం కాదు ..భక్తుల దగ్గరకే స్వామి వారిని తీసుకెళ్లే ఉద్దేశంతో చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర పేరిట ఉమ్మడి ఏపీ లోని మూడు ప్రాంతాల్లో కొన్ని వేల కిలోమీటర్ల పాటు మూడు రథాలను తిప్పేందుకు ఆయన పడ్డ శ్రమ ఈ పుస్తకంలో కనిపిస్తుందన్నారు. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది ఈయనేనని గుర్తు చేశారు.
తిరుమలలో జరుగుతున్న స్వామి వారి సేవలను ప్రపంచం లో ఏ మూలన ఉన్నా వీక్షించేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించేందుకు తాను పడ్డ శ్రమను రమణాచారి ఈ పుస్తకం లో వివరించారన్నారు. టీటీడీ పాలక మండలి ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ఓ సాధారణ ఉద్యోగి గుర్తు చేయగానే అమృతోత్సవాలు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రమణాచారి పూనుకున్నారు .ఈ కార్యక్రమానికి నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తన ఆలోచనలను టీటీడీ ,రాష్ట్ర ప్రభుత్వం ఆచరణ లో పెట్టేందుకు ప్రదర్శించిన పట్టుదల ,నేర్పరి తనం ఈ పుస్తకం లో ప్రతి పేజీ లోనూ కనిపిస్తాయన్నారు. ఆనంద నిలయమని సిద్దిపేటలో రమణాచారి గారు వృద్ధ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులకు సొంత ఇంటి లాంటి సౌకర్యాలు కల్పించి సేవ చేస్తున్నారన్నారు. ‘పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ అభినవోద్ధండ విద్యా శంకర భారతి స్వామి ముఖ్య అతిధిగా విచ్చేయగా, డిల్లీ దూరదర్శన్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ అనంత పద్మనాభ రావు, ఆధ్యాత్మిక వేత్త రఘునాథ శర్మ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పాలకవర్గ సభ్యుడు వల్లీశ్వర్, ఎమ్మెస్కో విజయ్ కుమార్, ,శ్రీమతి శోభారాజు గారు ,కిన్నెర ఆర్ట్ థియేటర్ అధ్యక్షులు ఆర్ .ప్రభాకర్ రావు గారూ కార్యదర్శి మద్దాళి రఘురాం అతిథులుగా పాల్గొన్నారు.





