మాది ఉద్యోగ నామ ప్రభుత్వం

– ఏడాదిన్నర కాలంలోనే 80 వేల కొలువులు ఇచ్చాం
– బాకీ కార్డులంటూ డ్రామాలాడుతున్న రాజకీయ నిరుద్యోగులు
– డీపీవో, ఎంపీడీవోల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: పదేళ్ల నిరీక్షణకు ఫలితం దొరికింది.. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మీలాంటి ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పించింది.. ఏడాదిన్నర కాలంలోనే 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగాం.. మాది ఉద్యోగ నామ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల ప్రభుత్వం అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డి ఆడిటోరియంలో డీపీవో, ఎంపీడీవోల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క గ్రూప్‌-1 పరీక్ష ద్వారా ఎంపికై రెండు వారాలపాటు శిక్షణ పూర్తి చేసుకున్న డీపీవో, ఎంపీడీవోలకు మంత్రి సీతక్క ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతకాలం మీరు విద్యార్థులు.. నేటినుంచి ఉన్నతాధికారులు., రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్‌-1 బ్యాచ్‌ మీది.. అందుకే తెలంగాణ చరిత్రలో మీకు ప్రత్యేక స్థానం ఉందంటూ అభినందించారు. పదవులు కోల్పోయి నిరుద్యోగులుగా మారిన కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు నిరుద్యోగ కార్డులు అంటూ డ్రామాలాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్‌ఎస్‌ నాయకులను నిరుద్యోగులు నిలదీయాలన్నారు. గ్రామీణాభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర కీలకమని, మండలస్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. ప్రతి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. మండల సమగ్ర స్వరూపం, శాఖలవారీగా పరిస్థితులు ఎంపీడీవోల చేతుల్లో ఉండాలని, ప్రగతి నివేదికలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. మానవ సేవే మాధవ సేవ అని గుర్తు చేసిన మంత్రి సీతక్క చివరి మనిషికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలంటే అసలైన అర్హులను గుర్తించి వారికి సహాయం చేయాలన్నారు. పేదలకు ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులే చుట్టాలు. అందుకే వారి జీవన ప్రమాణాలను పెంచడం మీ ప్రధాన బాధ్యత అని ఉద్బోధించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా అధికారులు వ్యవహరించాలంటూ పిలుపునిచ్చారు. ఉద్యోగ బాధ్యత నెరవేర్చే క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని మంత్రి సీతక్క సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, శిక్షణ పొందిన అభ్యర్థులు మంత్రి సీతక్కను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, డైరెక్టర్‌ సృజన మాట్లాడుతూ సరైన ఆలోచనలతో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరారు. రూల్‌ ఆఫ్‌ లా, చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో టీజీఐఆర్‌డీ సీఈవో నిఖిల తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page