– రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు రెండు కళ్లవంటివి
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటాం
– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ను కలిసిన ఏపీ అధ్యక్షుడు మాధవ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ తెలంగాణ కార్యాలయానికి శనివారం విచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహం, కార్యకలాపాల సమన్వయంపై ఇద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటూ ఆయా అభివృద్ధి అంశాలను వివరించారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, అప్పుడే అభివృద్ధి వేగవంతంగా జరగుతుందని అన్నారు. తెలంగాణ కార్యాలయానికి రావడం గురించి ప్రస్తావిస్తూ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కార్యాలయం నిర్మాణం, గృహప్రవేశం వంటి పనుల్లో పాల్గొన్న అనుభవం ఉందని, పూర్వం యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఈ కార్యాలయం ద్వారా ఉమ్మడి ఏపీలో పర్యటనలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించిన అనుభవం ఉన్నందున ఇక్కడికి రావడం హోమ్ కమింగ్ అనుభవం కలిగిందని చెప్పారు. రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు రెండు కళ్లలాంటివి.. రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. రామచందర్ రావుకు ఏపీలో కూడా అనేకమంది మిత్రులున్నారు.. ఆయన పూర్వం బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక పరిచయాలు ఏర్పరచుకున్నారు.. మేం ఈ ప్రాంతంలో కూడా పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో పనిచేశాం.. తమ తండ్రి పీవీ చలపతి రావు ఉమ్మడి రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు అని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పూర్తిస్థాయిలో పాల్గొంటామని, పురందేశ్వరి కూడా ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. రాబోయే కాలంలో వివిధ సమావేశాలు ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలిచేలా ఏపీ, తెలంగాణ నాయకులం కృషి చేస్తామన్నారు. తెలుగు ప్రజల సంక్షేమం, వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర కార్యాలయానికి ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పార్టీ ఏపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ జయప్రకాష్ విచ్చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఇద్దరం చర్చించామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





