– ప్రజలంతా కలిసుండాలని కోరుకుంటున్నాం
– జనసేన పార్టీని పోటీచేయొద్దని ఎవరన్నారు?
– తెలంగాణ ఆవిర్భావ దినం నాడు మీటింగ్ పెట్టడం సరికాదు
– రైతులకు ఉచిత కరెంట్ ఎగ్గొట్టే యత్నాలు
– జర్నలిస్టులను మోసం చేస్తున్న ప్రభుత్వం
– ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: మీ అయ్య జాగీరా? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరు. ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి.ఉండండి, ఎవరొద్దన్నారు? 10, 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ప్రాంతీయవాదం అంటే… మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, దాన్ని కూడా ప్రాంతీయవాదం అంటారా? అని ప్రశ్నించారు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల. కమ్యూనిస్టులు కదంతొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్తగాదు, మాకు యుద్ధాలు కొత్తగాదు, త్యాగాలు కొత్తగాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. పవన్ ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం. కానీ, వచ్చి మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోమని కుండబద్దలు కొట్టారు. ఈ దేశంలో ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇందులో ఏమీ అనుమానం పడక్కర్లేదు. కానీ, ఏ ప్రాంతంలోనైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారియొక్క మనోభావాలు, వారియొక్క పోరాటాలు, వారియొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి, వారి మీద అభిమానం ఉండాలన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేసింది కదా. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డుల్లో, కొత్తగా చేసేదేముంది? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవడొద్దంటున్నాడు? కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. జనసేన ను ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ 11 రోజులు అన్నం ముట్టకుండా ఉంటే, మళ్లీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా? మీటింగ్ పెడదాం అనుకున్నావ్, అడ్డుకున్నదెవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా అనాలనుకుంటే వాళ్లననాలి. కాబట్టి, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు.
-ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ విఫలం
ధాన్యం కొనుగోళ్ల పైన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు అలవాటుపడిన కాంగ్రెస్ పార్టీ, రైతన్నల దగ్గర ధాన్యం కొనే తెలివి లేకుండా పోయిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల పైన ముఖ్యమంత్రి చెప్తున్న మాటలన్నీ అవాస్తవమన్నారు. చివరి గింజ దేవుడెరుగు కనీసం తొలి గింజ కూడా కొనే పరిస్థితి లేదన్నారు. 60 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు దిక్కులు చూస్తూ వర్షానికి ధాన్యాన్ని నష్టపోతున్న పరిస్థితి ఉన్నదన్నారు. కేవలం రైతన్నలను నిండా ముంచి, వారిని ప్రైవేట్ దలార్లకు అమ్ముకునేలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదన్నారు. రైతన్నలకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ధాన్యం మాట దేవుడెరుగు కనీసం సంచులు కూడా సరఫరా చేయలేని సంక్షోభ పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ రైతన్నలను నెట్టిందన్నారు. ఇక రైతన్నలు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మోడీ – రేవంత్ జోడీ ప్రభుత్వం నడుస్తున్నదన్నారు. అందుకే రేవంత్ రెడ్డి తనతో కలిసి రావాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రైతన్నలకు ఉచిత కరెంటును దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ‘రైతు డిస్కమ్’ పేరిట కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ఒక్క రైతు కూడా అడగకుండానే ఎందుకు రైతు డిస్కమ్ పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు డిస్కమ్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాంటి రైతు డిస్కమ్ లేకుండానే రైతన్నలకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఏ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ మోటార్లకు మీటర్లు పెట్టే విధానం పట్ల జాగ్రత్తగా ఉండాలని రైతన్నలకు పిలుపునిచ్చారు. ఈరోజు ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు అంటూ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడుతూ, వాటి కింద ఉన్న ఆరు మోటార్లకు ఒక మీటరును పెడుతున్నదని, త్వరలోనే ప్రతి మోటార్ దగ్గర రేవంత్ రెడ్డి మీటర్ పెట్టబోతున్నాడని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీకి గెలిచినప్పుడు, ఓడినప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం పాటుపడడమే తెలుసు అని కేటీఆర్ అన్నారు. ఓడినప్పుడు ఆందోళనపడి, గెలిచినప్పుడు ఎగిరిపడేది ఏమీ లేదు అన్నారు. ఆటుపోట్లు రాజకీయాల్లో సహజమని కేసీఆర్ చెప్పినట్లు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదు అన్న ధైర్యంతోనే, సాహసంతోనే ముందుకు పోతున్నామని, దేశంలోని చాలా తక్కువ రాజకీయ పార్టీలలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ ఒకటి అన్నారు. ఫ్యూచర్ సిటీ అనేదే అసలు లేనే లేదనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా కోర్టులో చెప్పిందని, ఒకవేళ ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలు ఫార్మా సిటీ కోసం, పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలను ఎండగడతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముమ్మాటికీ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ కేవలం కాంగ్రెస్ పార్టీ తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నదని ఆరోపించారు. ఒకవైపు హైకోర్టులో ఫ్యూచర్ సిటీ లేదు, కేవలం ఫార్మా సిటీ మాత్రమే ఉన్నదని చెప్పిన కాంగ్రెస్, అక్కడ జూ పార్కులకు, ఇతర సంస్థలకు ప్లాట్ల చొప్పున అమ్మాలని చూస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీని ఖచ్చితంగా రద్దు చేస్తామని కేటీఆర్ అన్నారు. రెండు వందల కోట్లు… రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు కూడా అందరిలాగే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఫ్యూచరే లేని రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అనే ఒక ఊహాజనిత నగరంలో ప్లాట్లు ఇస్తామని జర్నలిస్టులను మోసం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నిజంగానే జర్నలిస్టుల ఇండ్ల పట్టాలు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికే జర్నలిస్టులకి ఇచ్చిన స్థలంలోనే స్థలాలు కేటాయించాలని, అవసరమైతే మంచిరేవుల లాంటి చోట కూడా, బుద్వేల్ వంటి చోట 100 ఎకరాలు కేటాయించాలని సూచించారు. కానీ కేవలం జూ పార్కుల పక్కన, ఫార్మా ప్లాంట్ల పక్కన జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి జర్నలిస్టు సమాజానికి 100 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారత రాష్ట్ర సమితిదేనని, అందరికన్నా ఎక్కువగా అక్రిడేషన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా భారత రాష్ట్ర సమితిదేనని కేటీఆర్ గుర్తు చేశారు. జర్నలిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న మాయమాటలకు లొంగిపోరాదని కేటీఆర్ అన్నారు. రానున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని, ఇందుకు సంబంధించి జర్నలిస్టులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఖచ్చితంగా వారు సూచించిన చోట ఇండ్లు, స్థలాలు అందజేస్తామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





