- బీసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
- బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్ర చట్టసభలలో బీ.సీ.బిల్లులను ప్రవేశపెట్టే ముందు పలు ప్రామాణిక పద్ధతులు పాటించాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు (Vakulabharanam Krishna Mohan Rao) విజ్ఞప్తి చేశారు. , బీ.సీల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈమేరకు శనివారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీల సమగ్ర అభివృద్ధి దిశగా 42% రిజర్వేషన్ బిల్లులను, రాష్ట్ర చట్టసభలలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయించడం ఒక కీలక ముందడుగని అన్నారు. ప్రభుత్వం, రాష్ట్ర కులగణనపై సమగ్ర అధ్యయనం నిమిత్తం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఛైర్మన్‌గా, సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్యని వైస్`ఛైర్మన్‌గా, పలువురు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేయడం ఒక శుభారంభం. కాగా, ఈ అధ్యయన కమిటీ నిర్ధేశించిన పనిని పూర్తి చేయకుండానే, నివేదిక సమర్పించక ముందే, ప్రభుత్వం బిసి. రిజర్వేషన్ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి సన్నద్ధం అవడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు, ఆచరణలు ఆమోదయోగ్యంగా ఉండాలి. చట్టపరమైన సవాళ్లు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, దిశా-నిర్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి అభినందనలు పొందాలి. అలా కాకుండా అనవసరమైన ఆలోచనలకు తావు ఇవ్వడం ప్రభుత్వం ప్రతిష్ఠకు భంగకరం. ఈ నేపథ్యంలో సాధికారికంగా ఉత్పన్నం అయ్యే పలు సహేతుకమైన సందేహాలకు ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాలని వకుళాభరణం కృష్ణమోహన్ రావు సూచించారు.
బూసాని వేంకటేశ్వరరావు నేతృత్వంలోని కమిషన్ కులగణన గణాంకాలను పూర్తిగా వినియోగించుకోకుండా, కులగణన వివరాలను అధికారికంగా ప్రభుత్వం నుండి స్వీకరించకుండానే ముందే నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికలో ఉన్న అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఇలాంటి అసంపూర్ణ నివేదిక ఆధారంగా బిల్లులను ప్రవేశపెడితే
భవిష్యత్తులో కోర్టు తీర్పులు, న్యాయ సవాళ్లు, కేంద్రం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.
న్యాయ సమీక్షలు – పరిశీలన:
ఇంద్రాసాహ్ని (1992), ఐ.ఆర్.కోల్హో (2007), డా.కె. కృష్ణమూర్తి (2010), వికాస్ కిషన్ రావు గవాలి (2021), రాకేష్ కుమార్ (2010), రాహుల్ రమేష్ వాగ్ (2022), సురేష్ మహాజన్ (2022), కేంద్ర ప్రభుత్వం (సుప్రీంకోర్టు), సునీల్ కుమార్, హరినారాయణ్ శర్మ, గౌరవ కుమార్ కేసులు ఙం. బీహార్, పాట్నా హైకోర్ట్ మున్నగు కీలక తీర్పులు ప్రకారం, 50% రిజర్వేషన్ల పరిమితిని దాటే విషయంలో ప్రత్యేక పరిస్థితులు, సమగ్ర ఆధారాలు, గణాంకాల విశ్లేషణ అవసరమని స్పష్టం చేస్తాయి.
అధ్యయన లోపాలు – అసలుకే మోసం:
ప్రస్తుతం ప్రవేశపెట్టే బిల్లులలో సాధికారిక గణాంకాలు, విశ్లేషణలు స్పష్టమైన నిరూపణలతో రూపొందించకపోతే ఆ రాష్ట్ర చట్టాలు న్యాయపరంగా నిలబడటం, పార్లమెంట్ ఆమోదం సందేహాస్పదమవుతుందని, రాజ్యాంగ సవరణ, 9వ షెడ్యూల్డ్‌లో చేర్చడం అనేది అసంభవమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బి.సీలకు ఇచ్చిన హామీ కూడా నెరవేరే అవకాశం ఉండదు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియలంతా వృథాప్రయాసగానే మిగిలిపోతాయి. ప్రభుత్వానికి అప్రతిష్ట తప్పదు.
లోపించిన పారదర్శకత`సమగ్ర విశ్లేషణలు:
డెడికేటెడ్ కమిషన్ నివేదికను పూర్తిగా, బహిరంగంగా ప్రచురించి, కులగణన గణాంకాలు, సామాజిక-ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంను సమగ్రంగా విశ్లేషించాలి. లోపాలను తీర్చిదిద్దిన తరువాతే చట్టాల రూపకల్పన దిశగా
చర్యలు చేపట్టాలి. కేవలం కేంద్ర అనుమతిని ఆశ్రయించడం, ఆ నిర్ణయాల నిమిత్తం ఎదురుచూడడం తగదు. రాష్ట్ర స్థాయిలో కూడా స్వతంత్రంగా అమలు మార్గాలను ఖచ్చితంగా ప్రకటించాలి.
– రిజర్వేషన్ బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లను అమలు చేసే విధంగా రాష్ట్ర చట్టాలను రూపొందిస్తున్నారు. అలాంటప్పుడు స్థానిక ఎన్నికలకు బూసాని వేంకటేశ్వరరావు డెడికేటెడ్ నివేదిక ఎలా అనివార్యమో, విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్ల పెంపుదలకు రాష్ట్ర బీ.సీ. కమిషన్ సిఫారసులు అంతే అనివార్యమైనవి. ఇలాంటి నిర్ధిష్ట పద్ధతులను అవలంభించడం వలన మాత్రమే బీ.సీలను అన్ని రంగాలలో బలోపేతం చేయడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం వీలవుతుంది.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి..
జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్యయన కమిటీ, రాష్ట్ర కులగణన సమగ్ర గణాంకాలను ఆధారంగా నివేదికను పూర్తిచేసి, దాని ఫలితాలను బహిరంగంగా ప్రకటించాలి. ఆ పరిమాణాత్మక సమాచారం ఆధారంగా ప్రభుత్వం బీ.సీ. బిల్లులకు ఉపక్రమించాలి. అంతకు ముందే సుదర్శన్‌రెడ్డి కమిటీ అధ్యయనం పారదర్శకంగా ఉందనడానికి వీలుగా, నివేదికలోని అంశాలపై నిపుణులు, మేధావులు, బీ.సీ. సంఘాల సూచనలను సమీకరించి తగిన సవరణలు చేయాలి. ఉన్నత కోర్టు తీర్పులు, దిశా-నిర్దేశాలను దృష్టిలో పెట్టుకుని, 50% రిజర్వేషన్ల పరిమితిని దాటే విషయంలో అవసరమైన ప్రత్యేక పరిస్థితులను, గణాంకాల ఆధారాలను రాష్ట్ర బిల్లులలో స్పష్టంగా పేర్కొనాలి. స్థానిక సంస్థల ఎన్నికలకే కాకుండా, విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ల అమలు పట్ల ఖచ్చితమైన మార్గదర్శకాలను ప్రకటించాలి ఉన్నత కోర్టు తీర్పులు, న్యాయ సూచనలు, సామాజిక, ఆర్థిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని, ముందస్తుగా ఏర్పరచిన విధానాలను అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు.
మార్చి 17న శాసనసభలో బీ.సీ. బిల్లులు ప్రవేశపెట్టే ముందు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికను పూర్తిచేసి, కోర్టు తీర్పులు, న్యాయ నిర్దేశాలను అనుసరించి, 42% రిజర్వేషన్ల అమలు పట్ల ప్రత్యేక దృష్టిని సారించాలి. పారదర్శకత, సమగ్ర విశ్లేషణలు లేకుండా, అత్యున్నత న్యాయస్థానాల తీర్పులు, దిశా నిర్దేశాలను పరిగణనలోకి తీసుకోకుండా, అసంపూర్ణ గణాంకాల ఆధారంగా బీ.సీ. రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టడం వలన అనేక సవాళ్లను ఎదుర్కొవలసి వస్తుంది. బీ.సీ. రిజర్వేషన్ల పెంపుదల లక్ష్యం నేరవేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కులసర్వే అధ్యయన కమిటీ పనిని పూర్తిచేసి, నివేదిక సమర్పించిన అనంతరం బీ.సీ.బిల్లులు ప్రవేశపెడితే ప్రయోజనం చేకూరుతుంది. అలాకాకుండా కేవలం రాష్ట్ర బీ.సీ. చట్టాలను కేంద్రానికి పంపించడం ప్రయోజన శూన్యం. పాటించాల్సిన ప్రామాణిక పద్ధతులతో రాష్ట్ర చట్టాలు రూపొందించబడి, కేంద్రానికి నివేదించినప్పుడు మాత్రమే, ఆయా సందర్భాలలో ఉత్పన్నమయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొని దేశంలోనే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలబడడానికి సాధ్యంమవుతుంది. ఈ నేపథ్యంగా ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసేది ఏమనగా… తెలంగాణ బీ.సీల హక్కులు, చేకూర్చే ప్రయోజనాలు మాటల్లోనే కాక, నిజమైన సాధికారికతగా, సమగ్ర న్యాయవిధానాల ద్వారా నిలబడేలా 42% రిజర్వేషన్ల అమలుకై ఖచ్చితమైన, శాస్త్రీయమైన, పారదర్శకమైన చర్యలు చేపట్టాలని వకుళాభరణం కృష్ణమోహన్ రావు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.