– కార్మిక, అధికారుల, ప్రజలకు కిషన్‌రెడ్డి అభినందనలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. ఎన్నో ఏళ్ల కల అయిన మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2(ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ గని సింగరేణికి దక్కడం పట్ల సింగరేణి కార్మికుల, కార్మికుల కుటుంబ సభ్యుల, కార్మిక సంఘాల ప్రతినిధుల, సింగరేణి అధికారుల, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇటీవలే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల-2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో పీకేఓసీ డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ బ్లాక్ సింగరేణికి వచ్చేలా అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని మంత్రిగానే కాక తెలంగాణ బిడ్డగా సింగరేణి శ్రేయస్సు, అభివృద్ధి, సింగరేణి కార్మికులను ప్రేమించే వ్యక్తిగా చేసిన ప్రత్యేక కృషి ఫలితంగా ఈ విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు. ఈ క్రమంలో సోమవారం వేలం ప్రక్రియ పూర్తవగా సింగరేణికి డిప్‌సైడ్ బ్లాక్‌ను కేటాయించనున్నారు. ఈ బ్లాక్‌లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్నాయి. ఏడాదికి ఆరు మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు ఈ గని నడుస్తుంది. దాదాపు రెండువేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇక్కడ దొరికే జి-8 (మంచి క్వాలిటీ) బొగ్గు కారణంగా సింగరేణికి మొత్తం రూ.43వేల కోట్లకు పైగా రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా లభిస్తుంది. దీనివల్ల రాష్ట్ర ఇంధన భద్రతకు భరోసా దక్కడంతోపాటు సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయి. ప్రభుత్వానికి, సింగరేణికి, విద్యుత్ రంగానికి, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. సింగరేణి బొగ్గు కంపెనీకి వరుసగా మÖడు బొగ్గు బావులు దక్కడం ద్వారా దక్షిణ భారత దేశానికి అవసరమైనంత మేర బొగ్గును అందుబాటులోకి రావడమేగాక తెలంగాణలో మరింత పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు మేలు జరుగుతుంది. సింగరేణి సంస్థకు ఆర్థిక బలం పెరిగి కార్మికులకు ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతుంది. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మÖడు బొగ్గు గనులు సింగరేణి సాధించడం ఒక శుభపరిణామం. నైని, తాడిచర్ల-2, పీకేవోసీ-2 డిప్‌సైడ్ బ్లాక్ రావడంతో సింగరేణికి 860 మిలియన్ టన్నుల రిజర్వ్స్ సమకూరుతాయి. 6,500 మందికి జీవనోపాధి లభిస్తుంది. సగటున 35 ఏళ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేయొచ్చు. ఈ మÖడు బ్లాక్‌ల వల్ల సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.48 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుంది
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





