కాంగ్రెస్‌లో ముదిరిన భేదాభిప్రాయాలు

– ‘తూర్పు’లో మూడు ముక్కలుగా పార్టీ కేడర్‌
– త్రిశంకు స్వర్గంలో వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు
– మంత్రి పర్యటనలకు ఆహ్వానం లేని వైనం
– కడియం పై సురేఖ ఫిర్యాదుతో బహిర్గతం

వరంగల్, ప్రజాతంత్ర, జూలై 8: వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలోని నాయకుల మధ్య‌ భేదాభిప్రాయాలు ముదిరిపాకాన పడుతున్నాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వం కొలువుదీరడంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న నేతలు పలువురు దశల వారీగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌లోని మాజీ టీడీపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో రేవంత్, వేం నరేందర్‌రెడ్డిలతో ఉన్న సాన్నిహిత్యంతో వీరికి పార్టీలో ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. ఈ పరిణామాన్ని కాంగ్రెస్‌ పాత కాపులైన కొండా వర్గం జీర్ణించుకోలేకపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొండా దంపతులు ప్రత్యేక వర్గంగా తయారై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారన్న ఫిర్యాదులు ఇప్పటికే సీఎం, టీపీసీసీ పెద్దలకు అందించినట్లు సమాచారం. అయినప్పటికి పార్టీ పెద్దలు పట్టించుకోకుండా ఎవరికి చెప్పే మాట వారికి చెబుతూ కాలం వెళ్ల‌దీస్తుండడంతో వర్గ విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని సీనియర్‌ నాయకులు అంటున్నారు. ఇది పార్టీ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులా తయారయ్యే అవకాశాలున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూర్పులో మూడు ముక్కలాట

వరంగల్‌ తూర్పులోని మంత్రి కొండా దంపతులు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు ఈ రెండు వర్గాల నాయకుల వద్దకు వెళుతూ తమ పనులు చేసుకునే నాయకులు మరో వర్గంగా తయారయ్యారు. ప్రస్తుతం తూర్పులోని కేడర్‌ మూడు ముక్కలుగా విడిపోయారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు, డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్‌లు కొండా దంపతులు మినహా మిగిలిన నాయకులతో మమేకం అవుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సురేఖ దంపతులతో పాటు వారి వర్గానికి చెందిన నాయకులు తాము చేపట్టే కార్యక్రమాల వివరాలు పార్టీలోని ఇతర ముఖ్యులకు కూడా చెప్పకపోవడంతోపాటు కనీసం సమాచారం అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తూర్పులో నిర్ణయాలు వారు సొంతంగా తీసుకోవడంపై ఇప్పటికే  ఈ ప్రాంతంలోని పార్టీ నాయకులు పలుమార్లు అధిష్టానం ముందు ఏకరవు పెట్టినట్లు తెలిసింది. తూర్పుకు చెందిన నాయకుడు అయూబ్‌ఖాన్‌కు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం మినహాయించి మిగిలిన పదవులు దాదాపు కొండా వర్గానికి చెందిన వారికే వస్తుండడంతో పార్టీలో డివైడ్‌ అండ్‌ రూల్‌ అనే పద్దతి కొనసాగుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా మాజీ మేయర్‌ కాంగ్రెస్‌లో ఉన్నప్పటికి స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనకుండా హైదరాబాద్‌ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. పదవిలో ఉన్నంతకాలం పార్టీలోని నాయకులను దగ్గరకు కూడా రానియ్యలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరంగల్‌ డీసీసీకి ఆఫీసు కరవు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆరు జిల్లాలుగా రూపాంతరం చెందిడంతో కొత్తగా ఏర్పడిన వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షునిగా వ్యవహరించడంతో కార్యాలయం అవసరం లేకపోయింది. ఎపుడైతే వరంగల్, హనుమకొండ జిల్లాలుగా ఏర్పడ్డాయో హన్మకొండలోని డీసీసీ భవనం ఆ జిల్లాకు పరిమితం కావడంతో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కార్యాలయం లేకుండా పోయింది. డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయ్యాక హన్మకొండ డీసీసీ భవనం అవరణలో కొత్తగా ఒక భవనం నిర్మించి వరంగల్‌ జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ భవనం విశాలంగా లేకపోవడంతో ప్రత్యేక కార్యాలయం ఉన్నప్పటికి డీసీసీ భవన్‌లో ఏదైనా పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తే అందులో పాల్గొని వరంగల్‌ నేతలు సంతృప్తి చెందుతున్నారు. వరంగల్‌ జిల్లా కేంద్రంగా వరంగల్‌ తూర్పులో వరంగల్‌ జిల్లా కేంద్రంగా ప్రభుత్వం గుర్తించి ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌(కలెక్టరేట్‌ కార్యాలయం) నిర్మిస్తోంది. అయినప్పటికి జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటికి పార్టీ కార్యాలయం లేకుండా పోయింది. జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అంతా హన్మకొండలో స్థిర నివాసం ఉండడం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జిల్లా అధ్యక్షునిగా తూర్పుకు చెందిన ఆయూబ్‌ఖాన్‌ నియమితులైనప్పటికి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా నేటికి నెరవేరలేదు. ఆయూబ్‌ఖాన్‌ను కొండా వర్గం అధ్యక్షునిగా నేటికి గుర్తించకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తుండడం గమనార్హం. తాజాగా మంత్రి సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తూ బహిరంగంగా లేఖ రాయడం నగరంలో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీలోని ఈ భేదాభిప్రాయాలు, అనిశ్చిత పరిస్థితి రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టికి నష్టం కలిగించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ సీనియర్‌ నాయకులు వాపోతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *