అన్ని శాఖల సమన్వయంతోనే సమగ్రాభివృద్ధి

– ప్రజల అవసరాలే గ్రామాభివృద్ధి ప్రణాళికలకు పునాది కావాలి
– జీపీ శాప్ శిక్షణను ప్రారంభించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడం, శాస్త్రీయ ప్రణాళికతో గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల అవసరాలకనుగుణంగా నిధుల వినియోగం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(జీపీ శాప్) శిక్షణ కార్యక్రమాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ శిక్షణలో తొలి రోజు బుధవారం 72 మండలాల్లోని 1,478 గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిక్షణల్లో గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, వి.బి.జి. రామ్-జి చట్టం అమలు, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, పారిశుధ్యం, పచ్చదనం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వివిధ శాఖల సమన్వయం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన శిక్షణను మంత్రి సీతక్క, శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిని కేవలం నిర్మాణ పనులకే పరిమితం చేయకుండా గ్రామ ప్రజల అవసరాలు, భవిష్యత్ అవసరాలు, ప్రకృతి వనరుల సంరక్షణ, ఉపాధి, మౌలిక వసతులు, మహిళల సాధికారత, సామాజిక అభివృద్ధి వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, ఉపాధి హామీ విభాగం, ఇంజినీరింగ్ శాఖలు, తాగునీటి శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ఈ శిక్షణ కేవలం నిబంధనలపై అవగాహన కల్పించడానికే కాదని, గ్రామాల భవిష్యత్తును నిర్మించే కార్యాచరణకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. గ్రామానికి ఏమి అవసరం, ఏ పనికి ప్రాధాన్యం ఇవ్వాలి, నిధులను ఎలా సమర్థంగా వినియోగించాలి, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై పూర్తి అవగాహనతో గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ ప్రజలతో చర్చించకుండా రూపొందించే ప్రణాళికలు ఆశించిన ఫలితాలు ఇవ్వవన్నారు. గ్రామ ప్రజలే తమ గ్రామ అవసరాలను నిర్ణయించాలి.. అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి అని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 16వ ఆర్థిక సంఘం నిధుల మార్గదర్శకాలు, వీబీజీ రామ్-జి చట్టంలోని కొత్త నిబంధనలపై ప్రతి సర్పంచ్, ప్రతి పంచాయతీ కార్యదర్శి పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రతి రూపాయి నిబంధనల ప్రకారమే ఖర్చు కావాలని ఆదేశించారు. దేశంలో పోలియో నిర్మూలన, కుటుంబ నియంత్రణ, హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం వంటి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఆమోదం పొందిన పంచాయతీ, మహిళా సంఘాల, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన భవనాలను ప్రజలకు అంకితం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. నీటి సంరక్షణను గ్రామాభివృద్ధిలో అత్యంత కీలక అంశంగా పేర్కొన్న మంత్రి ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి గ్రామానికి ఊటకుంట ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక పాలన అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజలు, ప్రభుత్వం భాగస్వామ్యంతో సాకారమయ్యే సామూహిక ఉద్యమమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *