యువ పోలీసుల చేతుల్లోనే పోలీస్ శాఖ ప్రతిష్ట

– ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రస్తుతం అత్యంత కీలకం
– కొత్త డీజీపీ సీవీ ఆనంద్ కు అభినందనలు
– వీడ్కోలు సన్మానంలో డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డికి పోలీస్ అకాడమీలో ఘనమైన వీడ్కోలు లభించింది. గురువారం ఆయన రిటైర్ అవుతున్న సందర్భంగా పోలీస్ అధికారులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ తన 32 ఏళ్ల సుదీర్ఘకాలంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు మిగిలాయన్నారు. వృత్తిలో భాగంగా పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పోలీసింగ్ విధానంలో ప్రస్తుతం అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, యువ పోలీస్ అధికారులు డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ విభాగం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు వెళ్లాలని సూచించారు. సర్వీసులో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పదవీ విరమణ పొందిన శివధర్ రెడ్డికి నూతన డీజీపీగా నియామకమైన సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఆయన ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పలు సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఆయన సూచనలు, సలహాలు తీసుకునేందుకు తాను సిద్ధమేనని ఆనంద్ తెలిపారు.

పోలీసు సారథికి ఆత్మీయ వీడ్కోలు

డీజీపీగా గురువారం పదవీ విరమణ చేసిన బి.శివధర్ రెడ్డికి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా నిర్వహించిన వీడ్కోలు వేడుక అత్యంత ఘనంగా, ఆత్మీయతతో కూడిన వాతావరణంలో సాగింది. సుదీర్ఘ కాలంపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి తనదైన ముద్ర వేసిన శివధర్ రెడ్డి నిష్క్రమణ సమయంలో సహచర అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమ ఆరంభంలో శివధర్ రెడ్డి తన బాధ్యతలను శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం.భగవత్‌కు అప్పగించారు. నూతన డీజీపీగా సి.వి.ఆనంద్ బాధ్యతలు స్వీకరించే వరకు ఇన్‌చార్జి డీజీపీగా మహేష్ భగవత్ వ్యవహరించనున్నారు. అధికారిక బదిలీ ప్రక్రియ అనంతరం వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ఐపీఎస్ అధికారులు, సిబ్బందికి అభివాదం చేస్తూ తనను కలిసేందుకు వచ్చిన వారితో కరచాలనం చేస్తూ, ఆత్మీయంగా పలకరిస్తూ శివధర్ రెడ్డి ముందుకు సాగారు. అనంతరం పూలతో అలంకరించిన వాహనంపై నిలబడి అందరికీ అభివాదం చేశారు. పోలీసు సంప్రదాయంలో అత్యంత గౌరవప్రదమైన రీతిలో ఐపీఎస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతుండగా ఇతర సిబ్బంది డీజీపీపై పూలు చల్లుతూ కార్యాలయ ప్రధాన ద్వారం వరకు సాగనంపారు. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రియతమ అధికారికి వీడ్కోలు పలుకుతుంటే ఆ ప్రాంగణం మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం.భగవత్, టీఎసఎలీల్బీఆర్బి చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయకుమార్‌లతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు సాదర వీడ్కోలు పలికారు. చివరగా ప్రధాన గేటు వద్దకు చేరుకున్న శివధర్ రెడ్డి అందరి కృతజ్ఞతలను స్వీకరిస్తూ తన వాహనంలో వెళ్లారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *