– భవిష్యత్ అవసరాలకు కోసమే మూడు కార్పొరేషన్లుగా ..
– రూ.1,674 కోట్లతో సైబరాబాద్ లో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం
– గాజులరామారంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్
– మూడు నెలల్లో పనులు ప్రారంభం
– కేసీఆర్, మోదీ పాలనపై చర్చకు సిద్ధం
~ మియాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఛాలెంజ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తున్నందున భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక పద్దతి ప్రకారం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికే మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా సరిహద్దులు నిర్ణయించామన్నారు. జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.1674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మియాపూర్‌లో జరిగిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో మాట్లాడారు. దిల్లీ, ముంబై, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్.. ఈ ఆరు నగరాలే దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నాయన్నారు. అయితే కాలుష్యంతో దిల్లీ నగరంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముంబై నగరంలో వర్షాలు వస్తే కార్లలో కాదు.. పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని, ట్రాఫిక్ కష్టాలతో బెంగుళూరు, చెన్నై కలకత్తా నగరాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదనే పక్కాగా పద్ధతి ప్రకారం అభివృద్ధి చేపట్టామన్నారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేవెళ్ల, మెదక్, మల్కాజ్‌గిరి ఎంపీలు బీజేపీ వాళ్లే ఉన్నారని, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాsంటూ బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని ఎందుకు నిధులు అడగడం లేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా అని అడిగారు. మోదీ గుజరాత్‌లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అంటున్నారు.. మనం మూసీని అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత లేదా అని అడిగారు. పదేళ్ల కెసీఆర్ పాలన, పన్నెండేళ్ల మోదీ పాలన, 30 నెలల తమ పాలనపై చర్చకు సిద్ధం.. ఎవరేం చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో చర్చిద్దాం రండి అని సవాల్ విసిరారు. త్వరలో గాజుల రామారంలో వంద ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ నిర్మించబోతున్నామని, మూడు నెలల్లో ఇందుకు సంబంధించిన పనులను మొదలవుతాయని చెప్పారు. విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి.. అందుకే మెట్రో రెండో దశ విస్తరణ చేపడుతున్నామన్నారు. మహానగరంలో లక్ష ఎలఐజీ, ఎంఐజీ ఇండ్లను కట్టి పేదల కష్టాలు తీరుస్తామన్నారు. ఆనాడు రాజీవ్ గృహకల్పలా ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఇండ్లు కట్టించి ఇస్తామని, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విడిపించి అక్కడ పేదలకు ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని, పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌ను అందిస్తున్నామని, మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి ద్వారా 150 స్టాల్స్‌ను మహిళలకు అందించామని, మహిళలను పెట్రోల్ బంకులకు యజమానులను చేశామని సీఎం వివరించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి చేతనైతే సూచన చేయండి.. మీ అవినీతి, అహంకారంతో ప్రజలకు నష్టం చేయకండి.. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తాను ప్రధానిని కలిస్తే కిషన్ రెడ్డి ప్రధానిని కలుస్తాడు.. నేను కేంద్ర మంత్రిని కలిస్తే ఆయన కేంద్ర మంత్రిని కలుస్తాడు.. రాష్ట్రానికి నిధులు రాకుండా, అభివృద్ధి జరగకుండా కాళ్లలో కట్టెలు పెడుతుండు అంటూ ఇలాగే చేస్తే మీకు తెలంగాణలో పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారు.. మళ్లీ మీరు దిల్లీకి పోకుండా చేస్తారు అని హెచ్చరించారు. రాబోయే 24 నెలలు అభివృద్ధిపైనే తాము దృష్టి పెడతామని, రాజకీయాలకు అతీతంగా నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు
రూ.161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి, రూ.530 కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు, రూ.308 కోట్లతో శేరిలింగంపల్లి ఆర్వోబీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు రూ.229 కోట్లతో ఓఆరఆర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ఓఆరఆర్ నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు, రూ.110 కోట్లతో శంకర్‌పల్లి రోడ్ ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి, రూ.29.25 కోట్లతో కొల్లూరు ఇంటsఛేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ హెడ్స్ (ఆర్వోబీల) వరకు నాలుగు లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి, రూ.26.50 కోట్లతో నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆరఆర్ ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, రూ.14.40 కోట్లతో మాదాపూర్, నానక్ రామ్‌గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్