– సంతాపం తెలిపిన సీఎం, మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఛాతీ నొప్పితో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఈ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో మరోమారు కార్డియాక్ అరెస్టు కావడంతో మృతిచెందారు. మధుసూదన్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మిర్యాలగూడలో నిర్వహించనున్నారు.గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారు. మధుసూదన్ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత నిజాయతీ, నిబద్ధత గల పాత్రికేయుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం సంతాపం
మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మధుసూదన్ అకాల మరణం చెందడం పట్ల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మధుతో తనకు చాలాకాలంగా స్నేహం ఉందని, ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
తీవ్రంగా కలిచివేసింది : మంత్రి పొంగులేటి
మధు హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా సంబంధాల అధికారిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు సంపాదించారని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. మధు అకాల మరణం కలచివేసిందని మంత్రి సీతక్క అన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న మధు మరణం బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు.
సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సంతాపం
ఉప ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మధుసూదన్ ఆకస్మిక మరణం పట్ల సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జి.ముకుంద రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. వృత్తిలో అత్యంత నిబద్దత కలిగినవాడు, ప్రొఫెషనల్ పీఆర్‌వోగా పనిచేసే మధు హఠాత్మరణం తీరని లోటు అని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా చేసిన కృషి విశిష్టమైనది : హరీష్‌రావు
సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం సీపీఆర్‌వో మధుసూదన్ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా ఆయన చేసిన కృషి ఎంతో విశిష్టమైనదని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




