‘సర్’ సర్జరీ.. 73 లక్షల వోట్ల కోత..!

ప్రజాస్వామ్య శుద్ధీకరణా? వోటర్ల హక్కుల కత్తిరింపా?
bhumaiah nameతెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది మునుపెన్నడూ చూడని అత్యంత భారీ,కీలకమైన వోటర్ల జాబితా సవరణ ప్రక్రియగా నిలిచిపోనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ రెడ్డి ఇటీవల వెల్లడించిన అధికారిక గణాంక వివరాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజానీకంలోనూ పెను తీవ్రమైన తుఫాను రేపాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది నమోదు కాబడిన వోఓటర్లు ఉండగా, అందులో ఏకంగా 21.70 శాతం అంటే 73,39,234 వోట్లు గల్లంతయ్యే పరిస్థితి  తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఒకే దెబ్బకు రాష్ట్రంలోని ప్రతి 5 మందిపౌరుల్లో ఒకరి వోటు హక్కు ప్రశ్నార్థకంలో పడటంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కాకరేపుతోంది.
సాధారణంగా ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రామాణిక జనాభా అంచనాల ఆధారంగా అర్హులైన వయోజన వోటర్ల శాతాన్ని లెక్కిస్తుంటారు. ప్రస్తుతం కేంద్ర జనగణన ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా సుమారు 3,86,00,000 నుంచి 4,35,00,000 వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో వోటు హక్కుకు అర్హులైన 18 సంవత్సరాలు నిండిన వయోజనుల జనాభాను బట్టి లెక్క చూస్తే, రాష్ట్రంలో నిజమైన వయోజనులు దాదాపు 2,60,00,000 నుంచి 2,70,00,000 వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు మన ఎన్నికల సంఘం జాబితాలో 3,38,26,448 మంది వోటర్ల సంఖ్య ప్రతిబింబించడం వాస్తవ జనాభా లెక్కలతో పోల్చి చూసినప్పుడు అసాధారణంగా ఉందనేది కొట్టిపారేయలేని నిజం. గత అనేక సంవత్సరాలుగా మరణించిన వారి పేర్లు సరిగ్గా తొలగించకపోవడం, ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు వలస వెళ్లిన వారి పేర్లు పాత చిరునామాలోనే అలాగే ఉండిపోవడం, ఒకే వ్యక్తికి గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో 2 వేర్వేరు నియోజకవర్గాల్లో వోట్లు నమోదు కావడం వంటి కారణాల వల్ల వోటర్ల జాబితా గత కొంతకాలంగా అనవసరంగా ఉబ్బిపోయింది.
ఈ క్రమంలోనే బోగస్ వోట్ల ఏరివేత, జాబితా ప్రక్షాళన కోసం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పేరిట ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రత్యక్షంగా వివరాలు సేకరించే సమగ్ర ప్రక్రియను ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో నిర్వహించింది. అయితే ఏకంగా 73,39,234 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించబడలేదని బయటకు తేలడంతో, సగం జనాభాను వ్యవస్థ మింగేసిందా అనే ఆందోళన ప్రజల్లో కలగడం సహజం. కానీ లెక్కింపు వర్గీకరణను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం అక్రమ తొలగింపులు మాత్రమే కావు. వీటిలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారినవారు 45,18,961 మంది కాగా, ఆచూకీ లేనివారు లేదా అందుబాటులో లేనివారు 11,25,546 మంది ఉన్నారు. అలాగే మరణించిన వోటర్లు 9,22,230 మంది, 2 చోట్ల నమోదు ఉన్న డూప్లికేట్ వోటర్లు 6,70,203 మంది, ఇతర కారణాలతో ఉన్నవారు 1,02,294 మంది ఉన్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే దాదాపు 43,00,000 కంటే ఎక్కువ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి కాకపోవడం గమనార్హం. నగరాల్లో అద్దె ఇళ్లు తరచూ మారడం లేదా బూత్ లెవెల్ అధికారులు వచ్చినప్పుడు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సంఖ్య ఇంత భారీగా పెరిగింది.
ఈ భారీ వోట్ల కోత అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్, బీజేపీ శ్రేణుల్లో తీవ్రమైన ఆందోళనను రేకెత్తించింది. తమ సాంప్రదాయ వోటు బ్యాంక్ లేదా తమకు మద్దతుగా నిలిచే బలమైన సామాజిక వర్గాల వోట్లు గల్లంతైతే రాబోయే స్థానిక సంస్థల, ఇతర ఎన్నికల ఫలితాలపై అది నేరుగా దెబ్బకొడుతుందనే తీవ్ర భయం రాజకీయ నాయకులను వెంటాడుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరి వోటు ఉందో, ఎవరి వోటు ఎగిరిపోయిందో తెలియక పార్టీల అగ్రనేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో వోటర్ల సంఖ్య సగానికి పడిపోవడం అసెంబ్లీ స్థానాల పరిధిలోని రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అర్హులైన వోటర్లు తమ ప్రాథమిక హక్కును కోల్పోతే అది ఎన్నికల పారదర్శకతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
అయితే ఈ 73,39,234 మంది పౌరులకు వోటు హక్కు పూర్తిగా పోయినట్లు భావించాల్సిన పనిలేదు. ఆగస్టు 17న వెలువడేది కేవలం ‘ముసాయిదా వోటరు జాబితా’ మాత్రమే. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన అమూల్యమైన వోటు హక్కును ప్రతి అర్హుడికీ కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత ఎన్నికల యంత్రాంగానిదే. సెప్టెంబర్ 16 వరకు ఫిర్యాదులు, సవరణలకు తగిన సమయం ఉన్నందున ప్రతి పౌరుడూ ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో బాధ్యతగా సరిచూసుకోవాలి. ఒకవేళ పొరపాటున పేరు ఎగిరిపోతే వెంటనే ఫారమ్-6 సమర్పించి అక్టోబర్ 19న విడుదలయ్యే తుది జాబితా నాటికి తమ వోటును పునరుద్ధరించుకోవడానికి సంపూర్ణ అవకాశం ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం కూడా ఆన్‌లైన్ సేవలను వేగవంతం చేయాలి.
వోటర్ల జాబితాను శుద్ధి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యకరమైన నిర్వహణకు ఎంత అవసరమో, ఆ నెపంలో అధికారుల అలసత్వంతో గానీ, సాంకేతిక సమస్యలతో గానీ ఒక్క నిజమైన పౌరుడి వోటు పోకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం. బోగస్ వోట్లను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అయితే అదే సమయంలో నిజమైన వోటర్లకు అవగాహన కల్పించి వారిని మళ్లీ జాబితాలో చేర్చడం యంత్రాంగం  ప్రధాన బాధ్యత. రాజకీయ పార్టీలు కూడా కేవలం పరస్పర విమర్శలకు పరిమితం కాకుండా, అర్హులైన ప్రతి పౌరుడూ తిరిగి జాబితాలో చేరేలా తమ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని బాధ్యతాయుతంగా నడిపించాల్సిన అత్యవసర సమయం ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *