క్షుద్ర పూజలతో ప్రభుత్వాలు కూలిపోతాయా..?

“ఇతర విమర్శల సంగతి ఎలా ఉన్నా తనను గద్దె దింపాలని, రాష్ట్రంలో కరవు రావాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేశాడనడంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటివెంట ఈ మాటలు రావడం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మూఢ విశ్వాసాలను నమ్మరాదని ప్రచారం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.”

ప్రపంచం విజ్ఞానశాస్త్రంలో పురోగతిని సాధిస్తుంటే పాలకులు మూఢనమ్మకాలపై విశ్వాసాన్ని వ్యక్తంచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. విద్య, వైజ్ఞానానికి దూరంగాఉన్న జనం ఇలాంటివాటిని నమ్మారంటే అది వారి అవగాహనలోపం అనుకోవచ్చు. కాని అశాస్త్రీయ నమ్మకాలపై ప్రజలను దూరంగా ఉంచాల్సిన పాలకులే వాటిపట్ల తమ భయాందోళనలను వ్యక్తంచేయడం విడ్డూరంగా ఉంది. దీనివల్ల నిజంగానే క్షుద్రపూజలు చేస్తే  ప్రభుత్వాలు కూలిపోతాయా ?  రాష్ట్రంలో కరవు వాతావరణం ఏర్పడుతుందా అన్న అనుమానాలకు తావేర్పడుతున్నది.
 మన దేశంలో ప్రాచీన కాలంనుండి కొన్ని నమ్మకాలు, ఆచారాలు కొనసాగుతున్నాయి. అయితే శాస్త్రీయంగా వాటిని విడమర్చలేక పోయినప్పటికీ అవి నేటికీ వాడుకలో ఉంటున్నాయి. ఇందుకు ఒకటి అజ్ఞానం కావచ్చు లేదా  అయిఉండవచ్చు. ఉదాహరణకు ప్రయాణ సమయంలో నల్లపిల్లి ఎదురుగా వస్తే అపశకునమని కొంతసేపు ప్రయాణాన్ని వాయిదావేసుకుంటారు. తుమ్మితే అశుభమనుకుంటారు. జంతు బలులైతేనేమీ, చిన్నపిల్లలను బలిఇస్తే తమపని నెరవేరుతుందన్న మూఢనమ్మకం పలువురి ప్రాణాలను హరించిన సంఘటనలెన్నో ఉన్నాయి. అంతెందుకు నేటికీ గ్రామాల్లో ఎవరికో మంత్రాలు వస్తాయని వాళ్ళవల్లే తమకు కష్టాలు వస్తున్నాయంటూ మంత్రోచ్చారణకు వీలులేకుండా వాళ్ళ నోటి పండ్లు రాలగొట్టడం, ఏకంగా చంపేయటం లాంటి ఘటనలు నేటికీ అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీనివల్ల సమాజంలో అసమానతలు, భేదాబిప్రాయాలు చోటుచేసుకోవడంతోపాటు హింస ప్రభలే ఆస్కారాలున్నాయి. ఇలాంటి మూఢ విశ్వాసాల నిరోధానికి ప్రభుత్వాలు, విద్యావేత్తలు వివిధ మాద్యమాలద్వారా సమాజాన్ని చైతన్యం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా అంద విశ్వాసాలను మనస్సులోనుండి పూర్తిగా తుడిచివేయలేకపోతున్నారు.
విచిత్రకర విషయమేమంటే ప్రజలను చైతన్యపర్చాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా విశ్వాసం వ్యక్తంచేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండీ ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ను ముఖ్యమంత్రి విమర్శించని రోజంటూ లేదు. అదికూడా మామూలుగా కాదు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ ఉపయోగించని పదజాలాన్ని ప్రయోగించడం సిఎం రేవంత్‌రెడ్డికి అలవాటైపోయింది. ఇతర విమర్శల సంగతి ఎలా ఉన్నా తనను గద్దె దింపాలని, రాష్ట్రంలో కరవు రావాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేశాడనడంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటివెంట ఈ మాటలు రావడం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
మూఢ విశ్వాసాలను నమ్మరాదని ప్రచారం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు రావాలని కొందరు దుర్మార్గులు( పరోక్షంగా హరీష్‌రావును) క్షుద్ర పూజలు కూడా చేశారని, అయితే వరుణదేవుడు తమపట్ల ఉండ టంవల్ల వానలు పడ్డాయని, క్షుద్ర పూజలు చేసినవారికే అవి రివర్స్ అవుతాయంటూ సాధారణ వ్యక్తిలా ఆయన మాట్లాడటంపట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికూడా వాటిని నమ్ముతున్నాడన్న భావన సామాన్య ప్రజల్లో ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. దానికి తగినట్లు  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఆ ‌పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్‌రెడ్డికూడా అదే అంశాన్ని తీసుకుని హరీష్‌రావుపైన, బిఆర్‌ఎస్‌ ‌నాయకులపైన మాటలదాడి మొదలుపెట్టడం విచిత్ర పరిణామం.
అనేక అంశాలను తీసుకుని హరీష్‌రావు ప్రభుత్వంపైన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేకనే ఆయనపై అబాండాలు వేయాలని కాంగ్రెస్‌ ‌పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నదని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరోపిస్తున్నారు. మూకాంబికా దేవి శక్తి స్వరూపిణి అని, అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవడమేంటంటున్నారు వారు. అనేకమంది రాజకీయ నాయకులు మూకాంబికా దేవిని సందర్శించుకుంటున్నారని వారంతా క్షుద్రపూజలు చేయడానికే వెళ్తున్నారా అని వారు ప్రశ్నించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలను రాజకీయ కక్షతోనే  చేస్తున్నారంటున్న హరీష్‌రావు  సిఎం రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ ‌నాయకులకు హరీష్‌రావు లీగల్‌ ‌నోటీసును పంపించిన విషయం తెలిసిందే. క ఏదిఏమైన క్షుద్ర పూజల అంశం తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *