అస్తిత్వం కోల్పోతున్న విశ్వవిద్యాలయాలు

విశ్వవిద్యాలయం అంటే  ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు జరిపే సరస్వతీ నిలయం.  అయితే కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాల్లో విద్య, విద్యా ప్రమాణాలు పడిపోతూ  యూనివర్సిటీల ప్రాధాన్యం తగ్గిపోతోంది.  విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ వారి భవితవ్యానికి ఊతమిస్తున్నాయి.  ఉన్నత విద్యను అందించడంలో మన దేశంలోని విశ్వ విద్యాలయాలకు మంచి గుర్తింపు ఉంది. అది ఇప్పటిది కాదు ఉన్నత విద్యకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరమ్‌) ర్యాంకింగుల్లో కుడా భారత్‌ మెరుగైన స్థానం సాధించింది. ఒకప్పుడు మనదేశం యావత్‌ ప్రపంచానికే దిక్సూచిగా నిలిచింది.. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు 500 ఏళ్ళ క్రితమే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించాయి. కానీ అప్పుడున్న అత్యున్నత స్థాయి విద్యాప్రమాణాలు ఇపుడు కానరావడం లేదు. నేటి విశ్వవిద్యాలయాల్లో విద్యావిధానం పరిశీలిస్తే నిర్ణీత సమయానికి పరీక్షలు నిర్వహించక, ఫలితాలను వెల్లడిరచక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు కనిపిస్తోంది.

 

నేటి విద్యా విధానంలో నాణ్యత లోపించింది. సమయపాలన పాటించకుండా వారికి తోచిన సమయంలో వచ్చి పాఠాలు బోధించడం ఒకటైతే, సిలబస్‌ పూర్తి కాకముందే పరీక్షల టైంటేబుల్‌ ఇవ్వడం, దానిని పలుమార్లు వాయిదాలు వేయడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. అంతేకాకుండా  విశ్వవిద్యాలయాల పనితీరు కూడా అధ్వాన్నంగా తయారైంది. పాలనా అధికారులు లేక విద్యావిధానం రోజు రోజుకి దిగజారిపోతోంది. అధ్యాపకుల కొరతతో పార్ట్‌ టైం, కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పరిపాలన అధికారులు నిర్లిప్తతతో తరచూ యూనివర్సిటీల్లో ఏదో ఒక అల్లరి, అలజడులు చోటుచేసుకుంటున్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రొఫెసర్లు ఎవరికి వారే  యమునా తీరే అన్నట్లు గా  వ్యవహరిస్తున్నారు. విద్యా విధానాన్ని మనం పరిశీలించనట్లయితే జె ఎన్‌ టి యు, హెచ్‌ సియు లో సంవత్సర కాలానికి సంబంధించి అకాడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌ ను విడుదల చేయడం, ఏ బంద్‌ లు వొచ్చినా దానికి అనుకూలంగా తరగుతులు నిర్వహించడం, సిలబస్‌ పూర్తి చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి సకాలంలో వాటి ఫలితాలను అందివ్వడం జరుగుతుంది. అయితే మిగతా యూనివర్సిటీల్లో ఆ పరిస్థితి లేదు. ఏ బంద్‌ లు వొచ్చినా యూనివర్సిటీలకు సెలవు ప్రకటించడం, పరీక్షలు వాయిదా వేయడం  జరుగుతోంది.

ప్రస్తుతం డిగ్రీ విధానంలో సిబిసిఎస్‌ ద్వారా సెమిస్టర్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే ఇందులో ఆయా డిపార్ట్మెంట్‌ లో అవగాహన సదస్సులు నిర్వహించారు. కొన్ని డిపార్ట్‌ మెంట్‌ లో అవగాహన సదస్సులు నిర్వహించ లేదు. అలాంటి తరుణంలో ఆయా సబ్జెక్టులలో ఎలా పరీక్ష ఉంటుంది.  ఎలా నిర్వహిస్తారు. ఇంటర్నల్‌  మార్కులు, ఇంటర్నల్‌ పరీక్షలు ఎలా నిర్వహించాలి. ప్రాక్టికల్స్‌ ఏ విధంగా ఇవ్వాలి అనే అంశాలను మరిచిపోయారు. అయినా ఇంటర్నల్‌ పరీక్షలు, ప్రాక్టికల్‌ పరీక్షలు అయిపోయాయి. థియరీ పరీక్షలలో కూడా అవగాహన కల్పించలేదు. వర్సిటీ ప్రాంగణాల్లో అందిస్తున్న కోర్సుల్లో విద్యార్థులు పూర్తి స్థాయిలో చేరుతున్నా..  యూనివర్సిటీ అనుబంధ పీజీ కళాశాలల్లో మాత్రం చాలా సీట్లు ఖాలీగానే ఉంటున్నాయి. ఎంబిఎ, ఎంసిఎ సీట్లు నిండటం లేదు.ఇలా చాలా కోర్సుల్లో చాలా సీట్లు ఖాలీగానే ఉన్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ కూడా పద్ధతిగా జరగడం లేదని చెబుతున్నారు. పక్కా షెడ్యూలు లేక,  అడ్మిషన్‌ ప్రక్రియలో నాణ్యత లోపించింది. పిహెచ్‌.డి. విషయానికొస్తే పరీక్షలు జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. రాత పరీక్షల జరిగిన మూడేళ్ల తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. పిహెచ్‌ డి కోసం కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ను పెడదామంటే విద్యార్థులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే మంచి జ్ఞానం కలిగిన విద్యార్థులు కాకుండా ఎవరికి పడితే వారికి పిహెచ్‌ డి ఇచ్చే సంస్కృతి విడనాడాలి. యూనివర్సిటీలలో చాలా వరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేరు. దీంతో పార్ట్‌ టైం, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు. అలాగే విద్యార్థులలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా లేవు. అందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు.  క్లాసులు తీసుకున్నామా ? జీతాలు వొచ్చాయా? అనేది ఆలోచిస్తున్నారు తప్ప యూనివర్సిటీలలో ర్యాంకులు వొచ్చే దిశగా యత్నాలు చేయడం లేదు. అయితే నేటి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత, నైపుణ్యాలు లేని అధ్యాపకులతో బోధన..  సరిjైున వసతులు లేక,  విద్యార్థులకు నాణ్యమైన బోధన అందటం లేదు. అత్యధిక మార్కులు,ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలే ఏకైక లక్ష్యంగా మారడంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి అధ్యాపకులు గానీ,  సంబంధిత అధికారులు గానీ ప్రయత్నిస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు.  అందుకే ఉన్నత విద్యాసంస్థలు ఇలా తయారయ్యాయి.

యూనివర్సిటీలలో ప్రస్తుతం రెగ్యులర్‌ అధ్యాపకుల  ఖాలీలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేసేది ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒకవేళ భర్తీ చేస్తే నిరుద్యోగులకు నీడనిచ్చిన వారవుతారు. విద్యార్థులకు మంచి విద్యాబోధన అందుతుంది. ఈ పోస్టులను భర్తీ చేస్తే నాణ్యమైన విద్యను విద్యార్థులకు మనం అందించవచ్చు. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద 1,100 కు పైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకు పైగా కళాశాలలున్నాయి. కానీ యుజిసి ద్వారా నిధులు పొందుతున్న విశ్వవిద్యాలయాలు,  కళాశాలలు 28% మాత్రమే.. సరిపడా నిధులు కూడా విశ్వవిద్యాలయాలకు రాకపోవడంతో  వర్సిటీల్లో సమయానికి పరీక్షలు నిర్వహించక, సరైన సమయంలో వాటి ఫలితాలను అందించక విద్యార్థులు ఒక సంవత్సర కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. పరిశోధనలకు, పరిశోధక విద్యార్థులకు నిధులను చాలా తక్కువగా కేటాయించడంతో మనదేశ యువత బయటి దేశాలలో పరిశోధనలు చేసి మంచి పేరుతెచ్చుకుంటున్నారు. కానీ మనం దేశంలో ఆ పరిస్థితి లేదు. ఎంతో తెలివి ఉన్నా కానీ అరకొర వసతులతో తన పరిశోధనను పూర్తి చేస్తున్నారు. వారిలో ఉన్న సృజనాత్మకత, పరిశోధనాశక్తిని సరిగా వెలికితీయలేకపోతున్నారు.
ఏది ఏమైనప్పటికీ విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అపుడే విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది. అందుకోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది.

 

తద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించవచ్చు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడున్న బడ్జెట్‌ లో విద్యకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశోధనలను ప్రోత్సహించాలి. విశ్వ విద్యాలయాలను మెరుగు పరచడానికి వెంటనే శాశ్వత అధ్యాపకులను నియమించాలి. గతంలో విశ్వవిద్యాలయాలు విసిల నియామకం ఒక పద్ధతి ప్రకారం జరగలేదనే చెప్పాలి. కనీసం ప్రొఫెసర్‌ గా 10 సంవత్సరాలు అనుభవమున్న వారినే విసిగా నియమించాలి అనే నిబంధనను తుంగలో తొక్కి ఏమాత్రం అనుభవం లేనివారిని అందలం ఎక్కించారు. ఇలా ఒక్క విషయం చెప్పలేము విసిల నియామకంలో రాజకీయ ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా చేస్తే  అర్హత, అనుభవం ఉన్నవారికి వీసీలుగా అవకాశం దక్కుతుంది. తద్వారా విశ్వవిద్యాలయాలు గాడినపడతాయి. ఉన్నత విద్యకు నిలయాలైన విశ్వవిద్యాలయాలలో పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయి. అది ఉస్మానియా, కాకతీయ, తెలుగు యూనివర్సిటీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

 

కాకతీయ విశ్వవిద్యాలయాలలో జరిగిన ఎంఫిల్‌, పి.హెచ్‌.డీలలో అవకతవకలు, డిగ్రీ ఫలితాల వెల్లడిలో జాప్యం వల్ల విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని కోల్పోయారు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన ఫలితాలు సరైన సమయంలో ఇవ్వక కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇవ్వడం వల్ల వారు ఒక అకాడమిక్‌ ఇయర్‌ కోల్పోతున్నారు. జెఎన్టియు 2 సంవత్సరాలుగా ఎంబిఏ చేసినవారికి ప్రాజెక్ట్‌ పేరు చెప్పి మరొక సంవత్సరకాలం నష్టపోవడం జరుగుతుంది. ఇలాంటివి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం ప్రస్తుతం ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల కోసం విదేశాల మీద అత్యధికంగా ఆధారపడాల్సి రావడానికి ఇదే ప్రధాన కారణం. విదేశాల్లోని భారతీయ విద్యార్థులు అద్భుత పరిశోధనలతో గొప్ప ఆవిష్కరణలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. మన విద్యార్థులను కూడా పరిశోధన రంగాలవైపు మళ్లించాలి. అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలి. అలా చేసినపుడే మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అత్యున్నతంగా నిలుస్తాయి. ఇలా అన్ని రంగాలలోను, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచి ఉన్నత ప్రమాణాలకు పట్టం కడతాయని ఆశిద్దాం!

మోటె చిరంజీవి
 9949194327    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *