ఆధునిక టెక్నాలజీతో నేర నియంత్రణ

– నేరగాళ్ల టెక్నాలజీ సవాల్‌గా మారింది
– దేశంలో పటిష్టంగా తెలంగాణ పోలీసింగ్
– డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని కఠన చర్యలు
– డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1:  తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శుక్ర‌వారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలకగా కార్యాలయ ఆవరణలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పండితుల వేద ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తానన్నారు. శాంతిభద్రతల కోసం అహర్నిశలూ శ్రమిస్తానని చెప్పారు. కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పనిచేస్తామన్నారు. నేరాల దర్యాప్తులో రాష్ట్ర పోలీసులు ఇప్పటికే ఉత్తమ పని తీరు కనబరిచారని చెప్పారు. మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారిందని, నేరగాళ్లు సైతం కొత్తకొత్త టెక్నాలజీని అనుసరిస్తూ నేరాలు చేస్తున్నారని, ఇది పోలీసులకు సవాలుగా మారిందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా డ్రగ్స్ ముఠాలు కూడా విస్తరిస్తున్నాయంటూ డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీసు బృందం బాగా కృషి చేస్తోందని అన్నారు. శాంతిభద్రతల సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకుందన్నారు. ఈ కేసును ప్రస్తుతం ‘సిట్‌’ విచారిస్తోందని, గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్ప్పుడే ఈ కేసు గురించి తనకు తెలుసునని, త్వరలో ఈ కేసును సమీక్షించి తుది చార్జిషీట్ ఫైల్ చేస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర డీజీపీగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఆనంద్ ధన్యవాదాలు తెలియజేశారు.

సైబర్ నేరాల అదుపులో జిల్లా ఎస్పీల పాత్ర కీలకం  

ప్రస్తుతం తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ పోలీస్‌గా గుర్తింపు పొందిందని, బ్రాండ్ ఇమేజ్ సాధించిందని అన్నారు. శాంతిభద్రతలు కాపాడటం, నేర నియంత్రణ, నేర దర్యాప్తులో తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. శాంతిభద్రతలు కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. సైబర్ నేరాలను అదుపు చేయడంలో జిల్లా ఎస్పీల పాత్ర కీలకంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ సమస్య ఇప్ప్పుడు సమాజంలో విస్తరించిందని, దాన్ని అరికట్టేందుకు ఈగిల్, నార్కోటిక్స్ సెల్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు టాప్ ప్రయారిటీ ఇస్తామని డీజీపీ చెప్పారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో ట్రాఫిక్ డీమేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేప్టీ బ్యూరోను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మహిళల సేప్టీ, చైల్డ్ ట్రాఫికింగ్ వంటి సమస్యలు వ్యవస్థీకృత నేరాలుగా మారాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే ప్రమాదాలపై కూడా పోలీసు శాఖ మరింత దృష్టి సారిస్తుందన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. నక్సలైట్ల నిర్మూలన కోసం ఏర్పాటైన గ్రేహౌండ్స్‌ను సరైన విధంగా పోలీస్ శాఖలో వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖలో ఖాళీలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, రిక్రూట్‌మెంట్, టైనింగ్‌లో మార్పులు తీసుకొస్తామని డీజీపీ తెలిపారు. పోలీస్ శాఖలో అధికారులు సంప్రదాయాలు, మర్యాదలు మరచిపోతున్నారని అన్నారు. వాటిని గుర్తు చేసి అధికారులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేర దర్యాప్తులో సీసీ కెమెరాలపై మాత్రమే ఆధారపడటం సరికాదని, సీన్ ఆఫ్ అఫెన్స్‌లో దొరికిన ఆధారాలతోనే కేసులను ఛేదించే పాత పద్ధతులను మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. గోవధపై పోలీసులే చర్యలు తీసుకుంటారని, పైవేటు వ్యక్తులు రోడ్లపైకి రావద్దని సీవీ ఆనంద్ హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *